Begin typing your search above and press return to search.

కేసీఆర్ గురించి చెబితే వినలేదు: కోదండరాం

By:  Tupaki Desk   |   1 Jan 2019 12:15 PM GMT
కేసీఆర్ గురించి చెబితే వినలేదు: కోదండరాం
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పోస్టుమార్టం చేసుకుంది. బయటకొచ్చి మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ తోనే టీఆర్ఎస్ గెలిచిందని నేతలు చెప్పుకొచ్చారు. కానీ ఓడిపోయిన అనంతరం బహిరంగంగా మీడియా ముందుకువచ్చి మాస్టారు మాట్లాడలేదు. ఎట్టకేలకు తెలంగాణ ఎన్నికలపై టీజేఎస్ అధినేత కోదండరాం నోరువిప్పారు.

ప్రచారం విషయంలో నిర్లిప్తత, సాగతీతే ఓటమి కారణమని.. తాను ఎంత చెప్పినా ఈ విషయంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు వినలేదని కోదండరాం అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచార శైలి గురించి తనకు తెలుసునని.. ఆయన ప్రచార శైలి మీకు తెలియదని ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్, టీడీపీ నేతలు వినిపించుకోలేదని కోదండరాం హాట్ కామెంట్స్ చేశారు. ప్రచారం చేసేందుకు పదిహేను రోజులు చాలు అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారని.. తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అయితే 3వారాలు సరిపోతాయని బీరాలకు పోయారని కోదండ రాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో అధికారుల తప్పిదాలు కూడా తమ కొంప ముంచాయని కోదండరాం చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ ఓటమికి ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు సరికాదని కోదండరాం తేల్చిచెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఈ వ్యాఖ్యలు షాకిచ్చాయి. ఈవీఎంల వల్లే ఓడిపోయామనడం కరెక్ట్ కాదని కోదండరాం అనడం కాంగ్రెస్ ను తీవ్ర ఇరకాటంలో పడేసింది.

చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేయడం.. కేసీఆర్ గెలిచాక రిటర్న్ గిఫ్ట్ ఇస్తామనడంపై కోదండరాం స్పందించారు. కేసీఆర్, చంద్రబాబుల మధ్య ఏం సంబంధాలు ఉన్నాయోనని.. అలాగే ఏం గిఫ్ట్ లు ఇచ్చుకుంటారో చూడాలని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ దేశంలో సాధ్యం కాదని కోదండరాం స్పష్టం చేశారు. మూడో కూటమి కట్టడానికి దేశంలో ప్రతిపాదనలు లేవని అన్నారు. తమ ఓటమిపై తర్వలోనే మహకూటమిలోని పార్టీలు సమావేశమవుతాయని.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై తాము చర్చిస్తామని తెలిపారు.