Begin typing your search above and press return to search.

భ‌ర్త కోసం పోలీసుల‌ను క‌లిసిన కోదండ‌రాం భార్య‌

By:  Tupaki Desk   |   22 Feb 2017 3:18 PM GMT
భ‌ర్త కోసం పోలీసుల‌ను క‌లిసిన కోదండ‌రాం భార్య‌
X
తెలంగాణ జేఏసీ ర్యాలీ నేప‌థ్యంలో చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అరెస్టుపై ఆయ‌న సతీమణి సుశీల హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌ ను క‌లిశారు. నగర పోలీస్‌ కమిషనర్‌ను కలిసిన తరువాత సుశీల మీడియాతో మాట్లాడుతూ కోదండరాం అరెస్ట్‌ ను పాశవిక చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేయాలని సంకల్పిస్తే అరెస్టు చేయడం దారుణమన్నారు. ఉద్యమ సమయంలోనూ పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించలేదని కోదండ‌రాం స‌తీమ‌ణి అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తామంటే అరెస్టు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. అర్థరాత్రి మా ఇంటి తలుపులు పగులగొట్టి నా భర్తను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందంటూ ఆమె క‌న్నీళ్ల ప‌ర్యంత‌మ‌య్యారు. దౌర్జన్యాలకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు. డీసీపీ రవీందర్‌ పై చర్యలు తీసుకోవాలని, త‌న భ‌ర్త స‌హా జేఏసీ నాయకులను విడుదల చేయాలని కోరామన్నారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని సీపీ హామీ ఇచ్చారని కోదండ‌రాం స‌తీహ‌ణి తెలిపారు.

కాగా, సీపీ కార్యాలయం నుంచి గవర్నర్‌ నరసింహన్‌ ను కలవడానికి కోదండరాం సతీమణి సుశీల వెళ్లారు. అయితే అనుమ‌తి లేని కార‌ణంగా గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌య వ‌ర్గాలు ఆమెను రాజ్ భ‌వ‌న్‌ లోకి రానివ్వ‌లేదు. గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌య వ‌ర్గాల నిర్ణ‌యంపై కోదండ‌రాం స‌తీమ‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదిలాఉండ‌గా... కోదండరాం అరెస్ట్‌ పై ఈ నెల 27వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని మానవహక్కుల కమిషన్ హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌ ను ఆదేశించింది. కోదండరామ్‌ అరెస్ట్‌ పై న్యాయవాది నవీన్‌ రెడ్డి హెచ్‌ ఆర్సీని ఆశ్రయించిన నేపథ్యంలో..అరెస్ట్‌ కు సంబంధించి నివేదిక ఇవ్వాలని హెచ్‌ ఆర్సీ ఈ మేర‌కు స్ప‌ష్టం చేసింది.

మ‌రోవైపు కోదండరాం - విద్యార్థుల అరెస్ట్ అప్రజాస్వామికమని సీపీఐ నేత నారాయణ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఖాళీలను భర్తీ చేయాలని కోరడం తప్పా? అని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం సమయలోనూ ఇంత నిర్బంధం లేదని ఆయన మండిపడ్డారు. వెంటనే కోదండరాంను విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్య‌మాల ఆధారంగా నాయ‌కుడిగా ఎదిగిన కేసీఆర్ అదే ఉద్య‌మాల‌ను అణ‌గ‌దొక్క‌డం స‌రికాద‌న్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/