Begin typing your search above and press return to search.

కోదండం సారు అల్టిమేటం ఇవ్వ‌లేద‌ట‌..

By:  Tupaki Desk   |   11 Oct 2018 12:54 PM GMT
కోదండం సారు అల్టిమేటం ఇవ్వ‌లేద‌ట‌..
X
ఉద్య‌మ నాయ‌కుడికి.. రాజ‌కీయ నాయ‌కుడికి మ‌ధ్య‌నున్న తేడా ఏమిటో ఒక‌ప్ప‌టి ఉద్య‌మ‌నేత‌.. తాజాగా తెలంగాణ జ‌న స‌మితి అధినేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కోదండం మాష్టారి బాగానే అర్థ‌మైన‌ట్లుంది. రెండు రోజుల క్రితం కోదండం మాష్టారు మాట్లాడుతూ.. కూట‌మిలో భాగంగా పార్టీల‌కు ఎన్ని సీట్ల ఇవ్వ‌నున్నార‌న్న విష‌యంపై క్లారిటీ ఇవ్వాల‌ని.. అది కూడా 48 గంట‌ల వ్య‌వ‌ధిలో అంటూ అల్టిమేటం ఇచ్చిన‌ట్లుగా వార్త‌లు రావ‌టం తెలిసిందే.

అయితే.. తాజాగా మాత్రం తాను అల్టిమేటం ఇచ్చిన వార్త‌ల్లో ఎంత మాత్రం నిజం లేద‌న్న వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. మీడియా ఎదుట అల్టిమేటం ఇచ్చిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చినా.. ఇప్పుడు మాత్రం అలాంటిదేమీ లేద‌ని కోదండం మాష్టారు ఎందుకు చెప్పిన‌ట్లు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

దీనికి సంబంధించినఅస‌లు విష‌యాన్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. కూట‌మికి ఎందిన ముఖ్య‌నేత‌లు ఆస‌క్తిక‌ర అంశాల్ని చెప్పుకొచ్చారు. సీట్ల స‌ర్దుబాటుకు సంబంధించిన చ‌ర్చ ఒక కొలిక్కి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. మొద‌ట్నించి కాంగ్రెస్ చెబుతున్న‌ట్లే అత్య‌ధిక సీట్లు కాంగ్రెస్ బ‌రిలోకి దిగుతుంద‌ని.. ఆపార్టీ చెప్పిన‌ట్లే త‌క్కువ సీట్లు భాగ‌స్వామ్య పక్షాలు బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఇప్ప‌టికిప్పుడు సీట్ల లెక్క‌.. అభ్య‌ర్థుల లెక్క బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌క్షంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చ‌క్రం తిప్పే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

అదే జ‌రిగితే మొద‌టికే మోసం వ‌స్తుంది. అందుకే.. వీలైనంత‌వ‌ర‌కూ పొత్తు లెక్క మీదా.. సీట్ల లెక్క మీదా వీలైనంత జాప్యం అవ‌స‌ర‌మ‌న్న మాట వినిపిస్తోంది. ఈ వ్యూహంపై క్లారిటీ మిస్ అయిన కోదండం మాష్టారు తొంద‌ర‌ప‌డి అల్టిమేటం మాట మాట్లాడార‌ని.. తాను మాట్లాడిన మాట‌తో జ‌రిగే న‌ష్టంపై అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. తాజా ప్రెస్ మీట్ తో క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేశార‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే తాజా ప్రెస్ మీట్ లో కోదండం మాష్టారు మాట్లాడుతూ.. తాము సీట్ల కోసం పొత్తులు పెట్టుకోలేద‌ని స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం. ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌.. దాని అమ‌లు.. జ‌న‌స‌మితికి గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్థానంపై కూట‌మిలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌న్నారు. ఉమ్మ‌డి ప్ర‌యోజ‌నాల కోసం త‌మ పోరాట‌మ‌ని.. దాని కోసం తాము తొంద‌ర‌ప‌డుతుంద‌న్న‌ది వాస్త‌వ‌మే అయినా.. ఒక‌ట్రెండు రోజుల్లో ఒక నిర్ణ‌యం వెలువ‌డుతుందని చెబుతున్నారు.

సీట్ల‌కు సంబంధించిన గోప్య‌త ఉంటుంద‌ని.. తాము ఏ రోజూ సీట్ల గురించి బ‌హిరంగంగా మాట్లాడ‌లేద‌ని.. ఇప్ప‌టికే ఒక స్ప‌ష్ట‌త ఏర్ప‌డింనద‌ని.. తాము ఇన్ని సీట్లు ఇవ్వాల‌ని ఎప్పుడూ అధికారికంగా చెప్ప‌లేద‌న్నారు. ఒక‌ట్రెండు రోజుల్లో అన్నీ తేలుతాయ‌న్న ఆయ‌న‌.. కోదండ‌రాం పోటీ చేయాలా? వ‌ద్దా? అన్న‌ది కూడా పార్టీ నిర్ణ‌యిస్తుంద‌ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం.