ఏపీకి హోదా పై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

Sun Apr 15 2018 13:27:48 GMT+0530 (IST)

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాజకీయాల్లో అరంగేట్రం చేయబోతున్న రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరాం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న కోదండరాం తన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న టీఆర్ ఎస్ కు భిన్నమైన విధానంలో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా సెటిలర్ల విషయంలో భిన్నమైన ఫార్ములాతో ముందుకు సాగుతున్నారు. అధికార టీఆర్ ఎస్ పార్టీ ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ సెటిలర్లకు పెద్దపీట వేసేందుకు  సిద్ధమవుతుంటే..కోదండరాం మాత్రం ప్రత్యేకమైన ఎజెండాను సిద్ధం చేసుకున్నారని ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఆయన ప్రత్యేక హోదా - అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ ఉద్యమం నాటి సీమాంధ్ర వ్యతిరేకతను ప్రదర్శించని సంగతి తెలిసిందే. పైపెచ్చు ప్రత్యేక ప్రేమను కనబరుస్తోంది. పార్టీ రథసారథి అయిన సీఎం కేసీఆర్ మొదలుకొని ఆయన రాజకీయ వారసులు అయిన మంత్రి కేటీఆర్ - ఎంపీ కవిత సైతం ఇదే వ్యూహాన్ని అమల్లో పెడుతున్నారు. ఉద్యమం సమయంలో తాము సిద్ధాంతపరమైన విమర్శలు మాత్రమే చేశామని పేర్కొంటూ ఏపీ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇటు పలు వేదికల్లో కేసీఆర్ అటు పార్లమెంటులో ఎంపీ కవిత డిమాండ్ చేశారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సైతం సీమాంధ్రుల విషయంలో పెద్దపీట వేస్తోంది.  గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు కసరత్తులు చేస్తున్నామని అన్ని అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వచ్చేలా వ్యూహాన్ని పన్నుతున్నామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ వెల్లడించారు. సీమాంధ్రకు చెందిన నేతలను గుర్తించి అవసరమైతే వారికి కూడా అసెంబ్లీ టిక్కెట్లు ఇస్తామన్నారు.

ఇలా అధికా పార్టీ - ప్రధాన ప్రతిపక్షం సీమాంధ్రులకు చేరువ అయ్యేందుకు చూస్తుంటే..కోదండరాం మాత్రం తనది భిన్నమైన ఫార్ములా అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ఏపీ ప్రజలు కోరుతున్న ప్రత్యేక హోదా విషయంలో తాజాగా కోదండరాం స్పందిస్తూ ప్రత్యేక హోదా కంటే ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడం మంచిదని అంటున్నారు. తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. ఏపీకి హోదా ఇవ్వడం వల్ల పెట్టుబడులన్నీ ఏపీకి మాత్రమే వస్తాయని తద్వార ఇతర రాష్ర్టాలు నష్టపోయి ఆర్థిక సమతూల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా అమరావతి పేరుతో ఒకే చోట అభివృద్ధిని కేంద్రీకరించడం సరైంది కాదని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.