కోదండను కాంగ్రెస్ పార్టీ బలిపశువును చేసిందా?

Tue Nov 13 2018 21:47:51 GMT+0530 (IST)

ఎందుకనో మొదటినుంచి సురక్షిత స్థానంగా భావించి జనగామను బలంగా కోరుకున్న తెలంగాణ జనసమితి నేత కోదండరాం ఇప్పుడు పొన్నాల కోసం ఆ సీటును త్యాగం చేస్తున్నట్లు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో రామగుండం నియోజకవర్గం పేరు తెరపైకి వచ్చింది.
    
నిజానికి కోదండరాం జనగామ పేరునే తొలి నుంచి కలవరిస్తున్నప్పటికీ రామగుండం ప్రాంత టీజేఎస్ నేతలు మాత్రం ఆయన్ను మొదటి నుంచి తమ నియోజకవర్గంలో పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నారు. ఉద్యమకాలంలో ఆయన వెంట నడిచినవారు ఆ ప్రాంతంలో చాలామంది ఉండడంతో వారంతా కోదండను అటువైపు ఆహ్వానిస్తున్నారు.
    
అయితే.. రామగుండం టిక్కెట్ కూడా ఆయనకు దక్కడం కష్టమే. ఎందుకంటే ఇప్పటికే అక్కడ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాజ్ ఠాకూర్ కూడా తెలంగాణలో బీసీ వర్గానికి చెందిన క్షత్రియ కులానికి చెందినవారు. పైగా ఆ ప్రాంతంలో చాలాకాలంగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తి.
    
పైగా ఇప్పటికే అక్కడ పోటీ తీవ్రంగా ఉంది. టీఆరెస్ అక్కడి నుంచి సిటింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు సీటివ్వగా.. అంతకుముందు అక్కడ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి స్వల్ప తేడాతో సోమారపు చేతిలో ఓడిన కోరుకంటి చందర్ ఇప్పుడు టీఆరెస్‌లో మళ్లీ టికెట్ రాకపోవడంతో మరోసారి రెబల్‌గా వేయడానికి రెడీ అయ్యారు. రామగుండంలో బలమైన నేతగా ఎదిగిన చందర్ వల్ల సోమారపు సత్యనారాయణ సైతం ఓటమి భయంతో ఉన్నట్లు టీఆరెస్ వర్గాల నుంచే వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మక్కాన్ సింగ్ ను తప్పించి కోదండరాంకు ఆ సీటు కేటాయించినా కూడా ఆయన నెగ్గుకు రావడం కష్టమే. పైగా ఒకప్పుడు వామపక్షాల చేతిలో ఉన్న సింగరేణి కార్మికుల ఓట్లు కూడా ఇప్పుడు టీఆరెస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వైపు మళ్లడంతో కోదండరాంకు అది అంత అనుకూలమైన సీటు కాదనే చెప్పాలి.
    
ఈ పరిస్థితుల్లో వరంగల్ జిల్లాలో ఎక్కడైనా సర్దుబాటు చేస్తారన్న ప్రచారం ఓవైపు సాగుతుండగా.. మరోవైపు కోదండరాం తాజా పరిణామాలతో పోటీ విషయంలోనే వెనక్కు తగ్గుతున్నారన్న వాదనా వినిపిస్తోంది. ఆయన కూటమికి సారథ్యం వహిస్తూ పోటీలో నిలవకుండా ఉండిపోవచ్చనే వాదన ఒకటి కొత్తగా వినిపిస్తోంది.అంతేకాకుండా... సీట్ల సర్దుబాటుపై మాట్లాడేందుకు ఆయన కాంగ్రెస్ నేతలను సంప్రదిస్తుంటే వారు ఫోన్లో ఆయనకు దొరకడం లేదన్నది టీజేఎస్ నుంచి తాజాగా వినిపిస్తున్న మాట.
    
మరోవైపు కాంగ్రెస్ నుంచి జన సమితికి ఇప్పటికి ఆరు స్థానాలకు మాత్రం కొంత సానుకూలత ఉన్నట్లు కోదండరాం ఇదివరకు చెప్పారు. మల్కాజ్ గిరి -  మెదక్ - దుబ్బాక - సిద్ధిపేట - వర్ధన్నపేట - అంబర్ పేటలకు కాంగ్రెస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. వీటిలో ఏదో ఒక చోటి నుంచి కోదండరాం పోటీ చేసే అవకాశాలూ ఉన్నాయి. కానీ సిద్దిపేట సహా మెదక్ జిల్లాలోని ఇతర స్థానాల్లో హరీశ్ రావు పోల్ మేనేజ్ మెంట్ ముందు కోదండ ఎంతవరకు నిలవగలరన్నది అనుమానమే. మొత్తానికి కోదండరాంను కాంగ్రెస్ పార్టీ బలి పశువును చేసినట్లుగానే కనిపిస్తోంది.