Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారుపై కోదండ‌రాం దీక్ష మొదలైంది

By:  Tupaki Desk   |   23 Oct 2016 12:02 PM GMT
కేసీఆర్ సర్కారుపై కోదండ‌రాం దీక్ష మొదలైంది
X
తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకునే క్రమంలో కేసీఆర్ – ప్రొఫెస‌ర్ కోదండ‌రాం మాష్టారి కాంబినేషన్ ఎంతలా వర్క్ వుట్ అయ్యింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ రాజకీయ వ్యూహం.. కోదండరాం ఉద్యమ వ్యూహంతో అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గడిచిన రెండున్నరేళ్ల వ్యవధిలో కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై కోదండరాం మాష్టారు అసంతృప్తి వ్యక్తం చేసినా.. ఏ రోజూ దీక్ష లాంటి పెద్ద మాటల్ని చెప్పిందీ లేదు.. చేసిందీ లేదు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గాలి వీస్తోందని.. ఆయన ఇమేజ్ భారీగా పెరిగిపోయిందని.. తెలంగాణ అధికారపక్షం ముందు విపక్షమే కానరావటం లేదన్న మాట వినిపిస్తున్న వేళ.. కోదండరాం మాష్టారు దీక్షాస్త్రాన్ని సంధించారు. ఇప్పటివరకూ కేసీఆర్ సర్కారు తీరుపై విమర్శలు మాత్రమే చేసిన కోదండరాం మాష్టారు.. తొలిసారి అందుకు భిన్నంగా దీక్షను చేపట్టటం ఒక కీలక పరిణామంగా చెప్పాలి. రైతుల సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తున్నట్లు చెప్పిన కోదండరాం మాష్టారికి.. తమ మద్దతును తెలిపేందుకు ఆచార్య హరగోపాల్.. చుక్కా రామయ్య.. జస్టిస్ చంద్రకుమార్.. పలువురు సీనియర్ పాత్రికేయులు సహా మేధావులు.. ఉద్యమవాదులు.. వామపక్ష భావజాలం ఉన్న పలువురు ముందుకు రావటం గమనార్హం.

ఎన్నికల వేళ రైతులకు ఇచ్చిన రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని.. కల్తీ విత్తనాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసిన కోదండరాం మాష్టారు.. రైతుల కోసం సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలంతా తమ వెనుకనే ఉన్నారని.. కొత్త జిల్లాల ఏర్పాటు జోష్ లో ఉన్న కేసీఆర్.. తానిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నట్లుగా సన్నిహితులతో చెబుతున్న వేళ.. కోదండరాం మాష్టారు రైతు దీక్ష అంటూ రోడ్లమీదకు ఎక్కటం చూస్తుంటే.. కేసీఆర్ హ్యాపీ నెస్ ఎక్కవ కాలం ఉండేలా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/