Begin typing your search above and press return to search.

కోదండా... ఇదీ కాంగ్రెస్ అంటే...!?

By:  Tupaki Desk   |   18 Nov 2018 5:39 AM GMT
కోదండా... ఇదీ కాంగ్రెస్ అంటే...!?
X
ప్రొఫెసర్ కోదండరాం. విద్యార్ధులకు పాఠాలు చెప్పడంలోను - ప్రజా సమస్యలపై ఉద్యమించడంలోనూ రాటుదేలిన మనిషి. తెలంగాణ మేథావుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. ప్రజాస్వామ్య రాజకీయాలంటే చదువుల ద్వారా తెలుసుకోవడమే కాని..... వాస్తవంగా అవి ఆయనకు అనుభవంలోకి లేవు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయనకు ఈ రాజకీయాల గురించి తెలియదు. కేవలం ఉద్యమమే తప్ప ఫక్తు రాజకీయాలను ఆయనెప్పుడూ అనుభవించలేదు. తెలంగాణ ఏర్పడడం, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం వరకూ కోదండ రామ్‌కు బాగానే ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయనకు అసలు రాజకీయాలు ఎలా ఉంటాయో అర్ధం అయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని అలిగారు. ఆ అలక అలా అలా ఆగ్రహంగా మారింది. అనంతర పరిణామాలలో ఆ ఆగ్రహం కాస్త ఆవేశంగా రూపాంతరం చెందింది. అదే తెలంగాణ జన సమితి అనే రాజకీయ పార్టీ ప్రారంభానికి పునాది అయ్యింది. రాజకీయ పార్టీ ఏర్పాటు వరకూ కూడా కోదండరామ్‌కు ఎటువంటి ఇబ్బంది ఎదురు కాలేదు. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌తో కలసి మహాకూటమి ఏర్పాటు చేసినప్పుడే అసలు రాజకీయాలంటే ఏమిటో తెలిసి వచ్చిందంటున్నారు.

మహాకూటమి ఏర్పడడం కూటమిలో నాయకులందరూ కలసి కట్టుగా చేతులు పైకెత్తి నినాదాలు ఇవ్వడం వరకూ బాగుంది. ఆ తర్వాత సీట్ల ఖరారు అభ్యర్దుల ఎంపిక వంటి అంశాలు తెరపైకి రావడంతో కోదండ రామ్‌కు రాజకీయాలో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం అంటే ఏమిటో పూర్తిగా అర్దమయ్యింది. కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు రోజుకు ఒక హోటల్‌లో తనతో చర్చలు జరపడం. సాయంత్రానికి ఇన్ని సీట్లు - అన్ని సీట్లు అని పత్రికలకు లీకులు ఇవ్వడం జరిగింది. ఈ పరిస్దితి ఊహించని, అంతకు ముందు అనుభవం లేని కోదండ రామ్ కూటమిలో ఉండాలా బయటకు రావాలన్నది కూడా తేల్చుకోలేని పరిస్దితి. కాంగ్రెస్ పార్టీ ఫక్తు రాజకీయాలు ఎలా ఉంటాయో తన సీటుకే ఎగనామం పెట్టే వరకు బోధపడలేదు. జనగామ నుంచి తెలంగాణ జన సమితి అభ్యర్దిగా కోదండ రామ్ పోటి చేస్తారని చివరి వరకూ కాంగ్రెస్ పార్టీనమ్మించింది. అక్కడ నుంచి పోటి చేయాలనుకుంటున్న కాంగ్రెస్ సీనీయర్ నాయకుడు పొన్నల లక్ష్మయ్యకు టిక్కెట్టు ఇవ్వడం లేదంటనూ చివరి వరకు సస్పెన్స్ లో ఉంచింది. కోదండ రామ్‌ కూడా జనగామ నుంచి తానే పోటి చేస్తున్నట్లు గా కార్యకర్తలకు, అభిమానులకు స్పష్టం చేశారు. జనగామలో కాంగ్రెస్ మార్కు నిరసనలు ఊపందుకున్నాయి. సరిగ్గా ఆ సమయంలోనే కాంగ్రస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. కోదండ రామ్‌ను ఢిల్లీ పిలిపించుకుని మీకు అత్యున్నత పదవులు ఇస్తాం, జనగామ మాకు వదిలేయండి అని కోరారు. వందేళ్లకు పైబడిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే నేరుగా తనను అభ్యర్దించడంతోకోదండ రామ్ కాదనలేకపోయారు. నిజానికి ఈ సీన్‌ అంతా కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత రాజకీయమేనని కోదండ రామ్‌కు అర్దం కాలేదు. రెండునెలల స్నేమంలోనే కోదండకు ఇన్నీ సినిమాలు చూపించిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మరెన్ని సినిమాలు చూపిస్తుందని తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.