Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాలపై కోదండం మార్క్ కొత్త ఫిట్టింగ్?

By:  Tupaki Desk   |   24 Aug 2016 5:45 AM GMT
కొత్త జిల్లాలపై కోదండం మార్క్ కొత్త ఫిట్టింగ్?
X
ఆవేశంగా మాట్లాడటం ఉద్యమకారుడి లక్షణం. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం. ఉమ్మడి రాష్ట్రంలో విభజన కోసం ఎంతో ఆవేశంతో వ్యాఖ్యలు చేసిన ఆయన.. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన తీరు కాస్త భిన్నంగా ఉందని చెప్పాలి. ఆవేశంతో మాట్లాడటం మానేసి.. నిర్మాణాత్మకమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చి.. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేలా ఆయన వ్యవహరించటం కనిపిస్తుంది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల వరకూ మౌనంగా ఉన్న ఆయన.. ఈ మధ్యన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని తప్పు పడుతున్నారు.

ప్రాజెక్టుల రీడిజైనింగ్ మీదా..వివిధ ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇచ్చే పరిహారం అంశంతో పాటు జోనల్ విధానం రద్దుపైనా ప్రభుత్వ వైఖరికి భిన్నంగా గళం విప్పిన కోదండం మాష్టారు తాజాగా కొత్త జిల్లాల అంశంపైనా తనదైన శైలిలో స్పందించటం గమనార్హం. కొత్త జల్లాల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదాను విడుదల చేసి.. ప్రజాభిప్రాయాన్ని కోరుతున్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పాలి.

జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించినట్లే స్వాగతించిన కోదండరాం.. జిల్లాల విభజనలో ఎంచుకున్న ప్రాధాన్యతలను ప్రజల ముందు ఉంచితే హేతుబద్ధమైన చర్చ జరిగే అవకాశం ఉందంటూ పెట్టాల్సిన ఫిట్టింగ్ పెట్టేశారు. జనాభా.. విస్తీర్ణం.. ఆదాయం.. చరిత్ర.. భౌగోళిక పరిస్థితులతో పాటు ప్రజల సంస్కృతి.. సంప్రదాయాల ఆధారంగా పునర్ విభజన జరగాలన్న విషయాన్ని చట్టం చెబుతుందని వ్యాఖ్యానించారు.

ఇలాంటి పాయింట్ కోదండం మాష్టారి నోటి నుంచి వచ్చిందంటే దాని లెక్క కాస్త వేరుగా ఉందనే చెప్పాలి. జిల్లాల విభజన.. కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం మొత్తం కూడా ముఖ్యమంత్రి ఆలోచనలు.. అభిరుచులకు.. ఆయనకున్న లెక్కల ప్రకారమే జరిగిందన్నది బహిరంగ రహస్యం. అనంతరం ఏర్పాటు చేసిన అఖిలపక్షంలో వచ్చిన సూచనల్లో కొన్నింటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. మరికొన్నింటిని తీసుకోలేదన్న విషయం తాజాగా కమ్యూనిస్ట్ నేతలు చెప్పిన మాటలతో తెలిసే పరిస్థితి.

ఇదిలా ఉంటే.. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో కోదండం మాష్టారు లేవనెత్తిన కొన్ని అంశాల్ని చూసినప్పుడు ప్రభుత్వం ఆ కోణంలో ఎందుకు చూడలేదన్న భావన కలగటం ఖాయం. ఉదాహరణకు చారిత్రక వరంగల్ నగరాన్ని వారసత్వ నగరంగా కేంద్రం ప్రకటించి నిధులు విడుదల చేయనున్న వేళ.. వరంగల్ నుంచి హన్మకొండను విడగొట్టటం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధుల మీద ప్రభావం పడే అవకాశం ఉందన్న సందేహాన్ని కోదండం మాష్టారు వ్యక్తం చేస్తున్నారు.

తన సందేహాలకు ఒకట్రెండు ఉదాహరణలు మాత్రమే ప్రస్తావిస్తున్న కోదండం.. కొత్త జిల్లాల మీద ప్రజలకు ఆయనో సలహా ఇస్తున్నారు. రెవెన్యూ డివిజన్లు.. మండలాల విషయంలో తమకున్న అభ్యంతరాల్ని పంచాయితీ నుంచి జిల్లా పరిషత్ వరకూ ఉన్న వివిధ స్థానిక సంస్థలు తమకున్న అభ్యంతరాల్ని తీర్మానాల రూపంలో పంపాలన్న సూచన చేస్తున్నారు. అదే సమయంలో ప్రజాభిప్రాయానికి తగ్గట్లే కొత్త జిల్లాల ఏర్పాటు జరగాలంటూ కోదండం మాష్టారు చెబుతున్న మాటలు చూస్తుంటే.. కొత్తజిల్లాల ఏర్పాటుపై కోదండం తనదైన శైలిలో ఏమైనా ఫిట్టింగ్ పెడతారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి కాలమే సమాధానం చెప్పే వీలుంది.