బీజేపీ తప్పు చేసింది - కోదండరాం!

Thu May 17 2018 12:33:57 GMT+0530 (IST)

తెలంగాణ జేఏసీ మాజీ రథసారథి తెలంగాణ జనసమితి వ్యవస్థాపకుడు కోదండరాం తన రాజకీయ దూకుడును మరింత పెంచుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు చేపడుతున్న కోదండరాం రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లోని నాంపల్లిలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావం మోగించారు. తన ఆఫీసు ప్రజా ఉద్యమాల వేదిక అని ప్రకటించారు. తమ నిర్మాణం బలంగా ఉందని టీజేఎస్ కార్యాచరణతో సత్తా తెలుస్తుందని వివరించారు.రంజాన్ మాసం ప్రారంభం అయిన రోజు తెలంగాణ జనసమితి ఆఫీస్ ను ప్రాంభించడం శుభ పరిణామమని కోదండరాం అన్నారు. కర్ణాటకలో పరిణామాలు బాధాకరమన్నారు. సాంకేతికంగా గవర్నర్ ను తప్పు పట్టడం లేదని అయితే బీజేపీ తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉందని అన్నారు. గవర్నర్ బీజేపీకి అంత సమయం ఇవ్వడం సరైనది కాదని దీనివల్ల ప్రలోభాలకు లోబర్చుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత క్రియాశీలంగా వ్యవహరించాలని కోరారు. రైతు సమస్యలపై ఖమ్మం నుండి కరీంనగర్‌కు వరకు తలపెట్టిన సడక్ బంద్‌కు తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబందు పథకంపై కోదండరాం స్పందించారు. రైతుబంధు పథకంతో లాభాల సంగతి అలా ఉంచితే కొందరు రైతుల ఉన్న భూమి పోయిందని ఆరోపించారు. టీజేఎస్ నిర్మాణం బలంగా ఉందని పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనేక మంది ఆసక్తి చూపడమే ఇందుకు నిదర్శనమని ఆయన వివరించారు.ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ ఆర్థిక నమూనా ఉండేదో  ఆ నమూనానే ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు లాభాలు తెచ్చిపెట్టే తరహా ప్రాజెక్టులపై తప్ప సాధారణ ప్రజలకు ఉపయోగపడే విధానాలను అమలు చేయడం లేదని విమర్శించారు. పౌరులుగా ప్రశ్నించే హక్కును ఉపయోగించుకునే వేదికగా టీజేఎస్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.