Begin typing your search above and press return to search.

తొడపాశం పెట్టినట్లు ప్రశ్నేసిన కోదండం

By:  Tupaki Desk   |   30 July 2016 10:06 AM GMT
తొడపాశం పెట్టినట్లు ప్రశ్నేసిన కోదండం
X
912924ఈ మధ్య తెలంగాణ అధికారపక్షానికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అధికారం చేపట్టిన నాటి నుంచి తిరుగులేని అధికారంతో చెలరేగిపోయిన వారికి ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తటం.. పెద్ద ఎత్తున భూమిని సేకరించే అంశంపై అక్కడి స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో పార్టీలన్నీ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఉలిక్కిపడిన తెలంగాణ అధికారపక్షం దిద్దుబాటు చర్యల్ని షురూ చేసింది.

మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ ముంపు గ్రామాలు ఎనిమిదింటిలో ఆరు గ్రామాల వారు భూములు ఇచ్చేందుకు అంగీకరించినట్లుగా ప్రకటించారు. హరీశ్ ప్రకటనతో మల్లన్నసాగర్ ఇష్యూ సెటిల్ అయిపోయిందని భావించినోళ్లు ఉన్నారు. అయితే.. ముంపు గ్రామాల్లో పర్యటించేందుకు వెళుతున్న రాజకీయ పార్టీ నేతల్ని అనుమతించకపోవటం.. మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు వెళుతున్నామన్న మాట వినిపించినంతనే సదరు నేతల్ని అదుపులోకి తీసుకోవటం చూస్తే.. ఈ ఇష్యూ ఇంకా క్లోజ్ కాలేదన్న విషయం అర్థమయ్యే పరిస్థితి.

ఇదే విషయాన్ని తాజాగా ప్రశ్నిస్తున్న తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం.. వారిని చూడటానికి వెళుతున్న నేతలపై ఎందుకు నిర్బంధాలు విధిస్తోంది అంటూ ప్రశ్నించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై తమకు కొన్ని సందేహాలు ఉన్నాయని.. వాటిని ప్రభుత్వం తీర్చాలన్నారు. మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాల్నిపరిశీలించేందుకు వెళుతున్న నేతల్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు.

మల్లన్నసాగర్ కు తాము వ్యతిరేకం కాదని.. కానీ.. ముంపు ప్రజలకు తగిన న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యంగా ఆయన చెబుతున్నారు. కోదండం మాష్టారు అడిగిన సూటి ప్రశ్నను చూస్తే.. పిల్లాడికి తొడపాశం పెట్టిన మాష్టారు గుర్తుకు రాక మానదు. ఏ ప్రశ్నకు అయితే సమాధానం చెప్పలేదో.. అదే ప్రశ్నను సంధించిన కోదండం మాష్టారి ప్రశ్నకు ప్రభుత్వం ఎలా సమాధానం ఇస్తుందో చూడాలి.