Begin typing your search above and press return to search.

పాల‌న భ్ర‌ష్టు ప‌ట్టిందంటున్న మాస్టారు

By:  Tupaki Desk   |   27 Jun 2017 3:27 PM GMT
పాల‌న భ్ర‌ష్టు ప‌ట్టిందంటున్న మాస్టారు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల‌న‌పై జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం మ‌రోమారు మండిప‌డ్డారు. రాష్ట్రంలో ప్ర‌జాసంక్షేమం కోరే రీతిలో ప‌రిపాల‌న‌ సాగ‌డం లేద‌ని ఆరోపించారు. పాలనా యంత్రాంగం భ్ర‌ష్టు పట్టిందన్న అభిప్రాయంలో ప్రజలు ఉన్నారని కోదండ‌రాం తెలిపారు. రాబోయే కాలంలో తెలంగాణలో పాలనను మార్చి తీరుతామ‌ని ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. నాంపల్లిలోని కార్యాలయంలో టీ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అమరుల స్పూర్తి యాత్ర..భవిష్యత్ కార్యాచరణ పై చర్చ జ‌రిగింది. అనంత‌రం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ అమ‌రుల స్పూర్తియాత్రలో భాగంగా 675కిలోమీటర్లు మొదటిదశ స్పూర్తి యాత్ర నిర్వహించామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాలు త‌మ దృష్టికి వ‌చ్చాయ‌ని తెలిపారు.

నిరుద్యోగ సమస్య త‌మ‌ దృష్టికి వచ్చిందని కోదండంరాం తెలిపారు. బ్యాంకుల్లో రుణాలు దొరక్క..అమ్మిన ధాన్యం డబ్బులు రాక రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మంజీరా నుంచి సంగారెడ్డి - మెదక్ కు సాగు నీరు అందించే ప్రయత్నాలు జరగడం లేదని ఆక్షేపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని రైతులు కోరుతున్నారని తెలిపారు. మెదక్ లో పిల్లల చదువు పై ప్రభుత్వం తగిన శ్రద్ధ పెట్టడం లేదని ఆరోపించారు. వివిధ ప్రాజెక్టుల కోసం బలవంతపు భూసేకరణ ఆపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని కోదండరాం తెలిపారు. బీడీ కార్మికులకు కనీస వేతనాలు లభించడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆయా ప్రాంతాల్లో అధికారులు..రాజకీయ నాయకుల పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని కోదండ‌రాం తెలిపారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన‌ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయని వివ‌రించారు. పెన్షన్ ల అమలులో కూడా అక్రమాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలు పేపర్ లకే ఎక్కువ పరిమితమైందని ఆరోపించారు. నాయకులకు అక్రమాల దందాలపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమం పై లేదని ఆరోపించారు. గ్రామపంచాయితీలు కునారిల్లి పోతున్నాయని కోదండ రాం ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పాలనా యంత్రాంగం భ్ర‌ష్టు పట్టిందన్న అభిప్రాయంలో ప్రజలు ఉన్నారని కోదండ‌రాం తెలిపారు. ఉద్యోగులు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నార‌ని అన్నారు. మల్లన్న సాగర్ ప్రాంతం భూగర్భం లో పగుళ్లు..పోరాలున్నాయి. అక్కడ ప్రాజెక్ట్ కడితే నిలువదని తెలిపారు. ఆ ప్రాజెక్టు 5 లక్షల మంది ప్రజల ప్రాణాలకు ప్రమాదమ‌ని అందుకే ప్రాజెక్ట్ ను ఆపాలని డిమాండ్ చేశారు. డిగ్రీ లో 40 శాతం మార్కులు పొందిన వారికి కూడా టెట్ రాసే అవకాశం కల్పించాలని కోరారు. రేషన్ డీలర్ల సమ్మెకు జాక్ మద్దతు ఇస్తుందని తెలిపారు. వారికి ఆదాయ భద్రత కల్పించాలని కోరారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే రీ డిజైన్ చేయొద్దని డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/