Begin typing your search above and press return to search.

టార్గెట్ కేసీఆర్..వ‌యా మైనార్టీలు

By:  Tupaki Desk   |   30 May 2016 2:48 PM GMT
టార్గెట్ కేసీఆర్..వ‌యా మైనార్టీలు
X
తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం అన్నంత ప‌నిచేస్తున్నారు. ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం కాకుండా ప్ర‌జల ప‌క్షాన పోరాటం చేస్తామ‌ని చెప్పిన కోదండ‌రాం అన్న‌ట్లుగానే ప్ర‌జ‌ల బాట ప‌ట్టారు. తాజాగా ఆయ‌న ముస్లింలకు చేరువ అవుతూ వారిని ప్ర‌భుత్వంపై పోరాటం చేయాల్సిందిగా చెప్తున్నారు. అంతేకాదు స‌ద‌రు వ‌ర్గాల‌కు త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

కరీంనగర్‌ లోని ఎంఎస్‌ ఆర్‌ ఎసీ అనే సంస్థ‌ అధ్వర్యంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నిర్వహించిన ముస్లిం గర్జనకు కోదండ‌రాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముస్లింలకు విద్య - ఉపాధిలో భాగస్వామ్యం ఉండటంలేదన్నారు. పాలనలో భాగస్వామ్యం.. బడ్జెట్‌ లో వాటో కోసం మైనార్టీలు ఐక్యంగా ఉద్యమించాలని, దీనికి జేఏసీ పక్షాన అండగా ఉంటానని కోదండరాం స్ప‌ష్టం చేశారు. రాజ్యాంగం ఎస్సీ - ఎస్టీ - సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్దేశిస్తోందన్నారు. రిజర్వేషన్లు ఎవరికి వర్తింపజేయాలన్న దానిపై మండల్‌ కమిషన్‌ లోతుగా అధ్యయనం చేసిందని వివరించారు. మైనార్టీల స్థితిగతులపై గతంలో వేసిన రంగనాథ్‌ మిశ్రా - సచార్‌ కమిటీలు ఆర్థికంగా - విద్యా - ఉపాధిలో వెనుకబడిన మైనార్టీలకు ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చని సూచించాయని అన్నారు. మైనార్టీ రిజర్వేషన్‌ కోసం జేఏసీ కట్టుబడి ఉందని చెప్పారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ....కేసీఆర్ మాటమీద నిలబడే వ్యక్తిని, మాట తప్పితే తలనరుక్కుంటానని వంద‌సార్లు అన్నారు అయితే ఆయన ఇప్పటివరకు ఆయన 114 సార్లు మాట తప్పారని గుర్తు చేశారు. ఎస్సీలకు మూడు ఎకరాల భూమి కొనిస్తాన‌ని హామీ ఇచ్చారని, ఇప్పటివరకు రాష్ట్రంలో 15వేల ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారన్నారు. ఎస్సీ ఉప ప్రణాళికకు ఇప్పటి వరకు నిబంధనలు రూపొందించలేదని గుర్తుచేశారు. రెండు పడక గదులు ఇస్తానని పేర్కొంటున్న కేసీఆర్‌ ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. ముస్లింలకు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తానని చెప్పి ఇప్పుడు రెండేళ్లుగా దాని వూసేలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ సభ నిర్వహిస్తుంటే ప్రభుత్వ పునాదులు ఎక్కడ కదిలిపోతాయోనని పాలకులు భయపడుతున్నారని అన్నారు. సీఎల్పీ ఉప‌నేత జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్‌ పై కేసీఆర్‌ కు నిజాయితీ లేదన్నారు. గతంలో వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి 5 శాతం ముస్లింలకు రిజర్వేషన్‌ ఇవ్వడానికి మైనార్టీ కమిషన్‌ వేస్తే కోర్టు కోట్టివేసిందని, అనంతరం బీసీ కమిషన్‌ వేసి రిజర్వేషన్లు ఇవ్వగలిగారన్నారు. ఇప్పుడు సైతం మైనార్టీ కమిషన్‌ వేశారని, దీన్నిచూస్తేనే కేసీఆర్‌ లో నిజాయతీ లోపించిన్న విషయం తేటతెల్లమవుతోందన్నారు.