Begin typing your search above and press return to search.

కేసీఆర్ తీస్మార్‌ ఖాన్ కాదంటున్న కోదండ‌రాం

By:  Tupaki Desk   |   20 Aug 2018 1:51 PM GMT
కేసీఆర్ తీస్మార్‌ ఖాన్ కాదంటున్న కోదండ‌రాం
X
తెలంగాణ ఉద్య‌మంలో క‌లిసి సాగి - అనంత‌రం వివిధ కార‌ణాల వ‌ల్ల దూరం అయి త‌న సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్న తెలంగాణ జ‌న‌స‌మితి అధ్యక్షుడు కోదండరాం ఇటీవలి కాలంలో త‌న దూకుడును త‌గ్గించినట్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ సంగ‌తి తెలిసిందే. ఒకింత గ్యాఫ్ త‌ర్వాత ఆయ‌న తాజాగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. కేసీఆర్ భాష‌లోనే ఆయ‌న్ను ఎండ‌గ‌డుతూ...కేసీఆర్ పెద్ద తీస్మార్‌ ఖాన్ ఏం కాద‌ని ఎద్దేవా చేశారు. అస‌లు కేసీఆర్ జ‌పిస్తున్న స‌ర్వేల మంత్ర‌మంతా...బూట‌క‌మ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.

హైద‌రాబాద్‌ లో విలేక‌రుల‌తో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ప్రొఫెస‌ర్ కోదండ‌రాం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే యోచ‌న చేస్తున్నారని తెలిపారు. కేంద్రం త‌న‌కు సహకరిస్తుందని కేసీఆర్ ఆలోచిస్తున్నాడని అయితే త‌నకున్న సమాచారం ప్రకారం ముందస్తు ఎన్నికలకు బీజేపీ కేసీఆర్‌ కు సహకరించదన్నారు. ముందస్తు ఎన్నికలు డిసెంబర్‌ లో జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్నారు. డిసెంబర్ 2 తరువాత అయితే ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుందని, ముందు అయితే ఎన్నిక నిర్వ‌హించే అంశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంద‌న్నారు. ముందస్తు - మధ్యంతర ఎన్నికలు కేసీఆర్ చేతిలో లేవని - కేంద్రం చేతిలో ఉన్నాయని కోదండ‌రాం పేర్కొన్నారు. ముందస్తు పేరుతో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా కేసీఆర్ ముందస్తు ఎన్నికలు అని చర్చకు తెర తీశార‌ని వ్యాఖ్యానించారు. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేసీఆర్ - బీజేపీ ఇద్దరు రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారని కోదండ‌రాం జోస్యం చెప్పారు.

నవంబర్ - అక్టోబర్‌ ల‌లో ముందస్తు ఎన్నికలు అని అనుకోవడానికి గ్యారెంటీ లేదని కోదండ‌రాం ధీమా వ్య‌క్తం చేశారు. కేసీఆర్ ముందస్తుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నాడో స్పష్టత లేద‌ని - బయటకి కారణం చెప్పలేకపోతున్నాడని అన్నారు. గ‌తంలో చంద్రబాబు ముందస్తుకు వెళ్లి నష్టపోయారని గుర్తు చేశారు. ముందస్తుకు వెళ్లి ఇతర పార్టీలను దెబ్బతీయలని కేసీఆర్ భావిస్తున్నాడని అయితే, కేసీఆర్‌ కు టీఆర్ ఎస్‌ పార్టీలోని సమస్యలు పరిష్కరించడం అంత తేలిక కాదని వ్యాఖ్యానించారు. ముందస్తు వస్తే టీజేఎస్ పార్టీకి లాభమ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. సెప్టెంబర్‌ లోపే టీజేఎస్ పార్టీ ప్రజలకు చేరువ అవుతుంద‌న్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు - గతంలో రాజకీయాల్లో ఉండి టికెట్ ద‌క్క‌ని వారు త‌మ పార్టీలోకి వస్తారని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. పొత్తుల కంటే తాము సొంతంగా బలపడడానికి దృష్టి పెడుతున్నామ‌ని - పొత్తుల కోసం ఇప్పుడే ఆలోచిస్తే పురిట్లో బిడ్డను చంపుకున్నట్టేన‌ని కోదండ‌రాం వ్యాఖ్యానించారు.

ఎన్నికలకు తెలంగాణ అంశమే మేజర్ ఫ్యాక్టర్ అని కోదండ‌రాం పేర్కొన్నారు. కేసీఆర్ మోసం చేసాడని ప్రజలకు అర్థం అయ్యిందని, ప్రజల ఆకాంక్షను తీర్చే పార్టీ కేవలం టీజేఎస్ మాత్రమేన‌ని ఆయ‌న తెలిపారు. రాజకీయాలలో కొత్త పార్టీలకు అవకాశం ఉందని కోదండ‌రాం అన్నారు. ఇంతకుముందు పీఆర్పీ - లోక్‌ స‌త్తా - టీడీపీ నేత‌ దేవేందర్ గౌడ్ న‌వ‌తెలంగాణ ప్ర‌జా పార్టీలను ప్రజలు ఆదరించారని అయితే వారు నిల‌బడలేదన్నారు. సర్వేలు పేరుతో అన్ని పార్టీలు మాయ చేస్తున్నాయని - ఏ పార్టీ కూడా సర్వే చేయలేదన్నారు. సర్వేల పేరుతో కేసీఆర్ ఇతరులను - సొంత పార్టీలోని వారిని బయపెడుతున్నాడని - కనీసం ఒక్క సర్వే నైనా కేసీఆర్ బయటపెట్టాలని ఆయ‌న డిమాండ్ చేశారు. కేసీఆర్ తీస్మార్ ఖాన్ కాదని కోదండ‌రాం ఎద్దేవా చేశారు.