Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా కోదండ‌రాం!

By:  Tupaki Desk   |   15 Oct 2018 9:28 AM GMT
ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా కోదండ‌రాం!
X
తెలంగాణ జ‌న స‌మితి(టీజేస్‌) అధినేత కోదండ‌రాం రాజ‌కీయ భ‌విష్య‌త్తు పై మ‌హాకూట‌మిలో తాజాగా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం అందుతోంది. కోదండ‌రాం ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌బోర‌ని కొంత కాలంగా వెలువ‌డుతున్న ఊహాగానాలు నిజ‌మేన‌ని తెలుస్తోంది. ఆయ‌న్ను ప్ర‌చారానికే ప‌రిమితం చేయాల‌ని.. త‌ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సాధ్య‌మైన‌న్ని ఎక్కువ ప్రాంతాల్లో ప‌ర్య‌టించేందుకు ఆయ‌న వీలు క‌లుగుతుంద‌ని మ‌హా కూట‌మి భావిస్తున్న‌ట్లు రాజ‌కీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న స‌మ‌యంలో కోదండ‌రాం అత్యంత క్రియాశీలకంగా వ్య‌వ‌హ‌రించారు. నాడు రాష్ట్రంలో అన్ని పార్టీలు క‌లిసి ఏర్పాటుచేసిన జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ(జేఏసీ)కి ఆయ‌నే నేతృత్వం వ‌హించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితంగా మెలిగారు. దీంతో ప్ర‌త్యేక రాష్ట్రం ఆవిర్భ‌వించాక టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో కోదండ‌రాంకు మంచి హోదా ల‌భిస్తుంద‌ని అంద‌రూ అంచ‌నా వేశారు. అయితే, అంచ‌నాల‌న్నింటినీ తారుమార‌య్యాయి. కేసీఆర్‌, కోదండ‌రాంల మ‌ధ్య దూరం పెరిగింది. చివ‌ర‌కు కోదండ‌రాం టీజేఎస్ పేరుతో సొంత కుంప‌టి పెట్టుకోవాల్సి వ‌చ్చింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓట‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్‌, టీడీపీల‌తో కూడిన మ‌హాకూట‌మితో టీజేఎస్ చేతులు క‌లిపింది.

తాజాగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డి నేతృత్వంలో మ‌హాకూట‌మి కోర్ క‌మిటీ భేటీ అయింది. కోదండ‌రాం రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఈ స‌మావేశంలో చ‌ర్చ జరిగింది. కోదండ‌రాంకు రాష్ట్ర వ్యాప్త ఆద‌ర‌ణ ఉంద‌ని.. కాబ‌ట్టి ఆయ‌న్ను అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్షంగా బ‌రిలో దించి ఒకే నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం చేస్తే కూట‌మికి న‌ష్టం క‌లిగే అవ‌కాశముంద‌ని ఈ భేటీలో నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. పోటీకి దూరంగా ఉంచి.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న‌తో ప్ర‌చారం జ‌రిపించాల‌ని వారు భావిస్తున్నారు. పోటీకి దూరంగా ఉన్నంత మాత్రాన కోదండ‌రాం రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఎన్నిక‌ల్లో కూట‌మి విజ‌యం సాధించాక ఆయ‌న‌కు డిప్యూటీ సీఎం లేదా ఆ హోదాతో స‌మాన‌మైన ప‌ద‌వి ఇవ్వాల‌ని వారు నిర్ణ‌యించినట్లు తెలుస్తోంది.

టీజేఎస్‌కు కేటాయించే సీట్ల సంఖ్య‌పైనా కూట‌మి కోర్ క‌మిటీ చ‌ర్చ జ‌రిపింది. త‌మ‌కు 16 సీట్లు కావాల‌ని టీజేఎస్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వ‌ర‌లోనే కోర్ క‌మిటీ తుది నిర్ణ‌యం వెలువ‌రించే అవ‌కాశ‌ముంది. ఎన్ని సీట్లు కేటాయించినా.. టీజేఎస్ అభ్య‌ర్థులను కూడా హ‌స్తం గుర్తుపైనే పోటీ చేయించాల‌ని కోర్ క‌మిటీ భావిస్తోంద‌ని స‌మాచారం. కొత్త గుర్తుతో జ‌నం అయోమ‌యానికి గురికాకుండా ఉండేందుకు ఈ వ్యూహం దోహ‌ద‌ప‌డుతుంద‌న్న‌ది కోర్ క‌మిటీ నేత‌ల అభిప్రాయం.