పోస్టర్ కలకలం!.. టీడీపీకి కొడాలి నాని సవాల్!

Sun Feb 10 2019 21:02:51 GMT+0530 (IST)

మోదీ ఏపీ టూర్... టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్దానికి తెర తీసింది. ఏపీ పర్యటనకు వచ్చిన మోదీ... గుంటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీకి అనుకూలంగా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టర్లు హోర్డింగులు వెలిశాయి. మోదీకి స్వాగతం పలుకుతూ బీజేపీ నేతలు హోర్డింగులు పెట్టడంతో పాటుగా పెద్ద ఎత్తున పోస్టర్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే బయట ఎక్కడా కనిపించని పోస్టర్లు కొన్నింటిని... టీడీపీ నేతలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. మోదీ సభకు జనాన్ని తరలించేందుకు ఉద్దేశించినవిగా కొన్ని ఆటోలను పేర్కొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేశ్... కొన్ని ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఆటోలకు జగన్ బ్యానర్లు పోస్టర్లు వేసి ఉన్న వైనం ఆసక్తిని రేకెత్తించింది. ఈ ఫొటోలను ఆధారం చేసుకుని మోదీ సభకు వైసీపీ జనాన్ని సమీకరించిందని లోకేశ్ ఆరోపించారు.ఆ వెంటనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన మరో పోస్టర్ పెను దుమారమే లేపింది. ఏపీలో మోదీ టూర్ ను స్వాగతిస్తున్నట్లుగా రూపొందించిన సదరు పోస్టర్ ను వైసీపీ కీలక నేత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఏర్పాటు చేసినట్లుగా ఉంది. అంతేకాకుండా సదరు పోస్టర్ లో మోదీ ఫొటోతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొడాలి నాని ఫొటోలు కూడా ఉన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న కొడాలి నాని... ఓ రేంజిలో ఫైరైపోయారు. టీడీపీ చీప్ ట్రిక్స్‌లో భాగంగానే ఈ పోస్టర్ బయటకు వచ్చిందన్న కోణంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని... దమ్ముంటే తన వద్దకు వస్తే అసలు వాస్తవాలేమిటో చెబుతానంటూ టీడీపీ నేతలకు గట్టి సవాలే విసిరారు. ట్విట్టర్ వేదికగానే ఘాటుగా స్పందించిన కొడాలి నాని.. టీడీపీ నేతలను ఏకంగా సుంటల్లారా అంటూ సంబోధించి సంచలనం రేపారు.

ట్విట్టర్‌లో కొడాలి నాని పెట్టిన పోస్ట్‌ను ఓ సారి పరిశీలిస్తే... పచ్చ పకోడీగాళ్ళారా.. దమ్ముంటే నా దగ్గరికి రండి సమాధానం చెప్తా. ఇలా మీకు మీరే జగనన్న ఫోటో నా ఫోటో పెట్టి బ్యానర్లు వేసుకుని శునకానందం పొందడం ఏందిరా సుంటల్లారా. నాలుగేళ్ళు మోడీ సంకనాకింది ఎవరు? నాలుగేళ్ళు కాపురం చేసింది మీరు. మేం కాదు. మోడీ ఐనా చంద్రబాబు లాంటి కేడీ అయినా మాకు ఒక్కటే అంటూ కొడాలి చాలా ఘాటుగానే స్పందించారు. అయినా మోదీ టూర్ ను తామెందుకు స్వాగతిస్తామని చెప్పిన కొడాలి... తమను అభాసుపాల్జేసేందుకు టీడీపీ నేతలే ఈ పోస్టర్ ను తయారు చేయించి దుష్ప్రచారం చేస్తున్నారన్న కోణంలో ఫైరైపోయారు. మొత్తంగా ఈ పోస్టర్‌ను చూసిన వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన కొడాలి.. టీడీపీ నేతలపై విరుచుకుపడటంతో పాటు వారిని పకోడీగాళ్లు సుంటలు అంటూ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.