Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ ఎల్పీలో జగన్ పార్టీ ఏపీ ఎమ్మెల్యేలు?

By:  Tupaki Desk   |   26 May 2016 11:22 AM GMT
టీఆర్ ఎస్ ఎల్పీలో జగన్ పార్టీ ఏపీ ఎమ్మెల్యేలు?
X
రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని ఒకే పార్టీ ఎమ్మెల్యేలే ఒకరికొకరు సరిగా పలకరించుకోని పరిస్థితి. కలిసినా.. తూతూ మంత్రంగా మాట్లాడుకోవటమే తప్పించి గతంలో మాదిరి వారి మధ్య అనుబంధం అంతంతమాత్రమే. అలాంటిది సంబంధం లేని పార్టీ నేతలు.. ఏ మాత్రం ఊహించని కాంబినేషన్లో దర్శనం ఇవ్వటం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఏపీకి చెందిన జగన్ పార్టీ ఎమ్మెల్యేలు.. తెలంగాణ అధికారపక్షమైన టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కనిపించటం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది.

మిగిలిన పార్టీల సంగతేమో కానీ.. ఓపక్క టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై జగన్ విరుచుకుపడుతున్న వేళ.. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఏపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కనిపించారు. అయితే. వారు అలా రావటానికి సముచితమైన కారణం ఉందని చెప్పాలి. జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొడాలి నాని.. జోగి రమేశ్ లు ఇద్దరు టీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసుకు వచ్చారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచిన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అభినందించేందుకు వారు ఇరువురూ వచ్చారు.

పార్టీకి సంబంధంలేని వారు ప్రత్యేకించి పార్టీ ఆఫీసుకే రావాలా? అన్న డౌట్ రావొచ్చు. దీనికి కారణం లేకపోలేదు.తాజాగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని ఎంపిక చేయటం.. ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు అసెంబ్లీకి వచ్చిన జగన్ పార్టీ నేతల్లో కొడాలి నాని.. జోగి రమేశ్ లు ఉన్నారు. టీడీపీలో సుదీర్ఘంగా ఉన్న తుమ్మలతో.. అదే పార్టీలో గతంలో ఎమ్మెల్యేగా వ్యవహరించిన కొడాలి నానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనకెంతో ఆఫ్తుడైన తుమ్మలను అభినందించేందుకే కొడాలి నాని టీఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ఏమైనా భిన్నమైన కాంబినేషన్లో నేతల కలయిక అందరిని ఆకట్టుకునేలా చేసిందని చెప్పాలి.