కాంగ్రెస్ రాజకీయంలో కోదండరాం 'బలి' చక్రవర్తి

Thu Nov 08 2018 11:28:42 GMT+0530 (IST)

కాంగ్రెస్ రాజకీయాలు మరీ.. స్వాతంత్ర్యం పుట్టినప్పటి నుంచి ఉన్న పార్టీ అదీ.. అంత త్వరగా తేలిస్తే ఏం మజా.. అందుకే రెబల్స్ బెడత తప్పించుకునేందుకు నాన్చి నాన్చి సీట్ల సర్దుబాటు తేల్చడం లేదు. నెలరోజు ల్లోనే ఎన్నికలున్నా కూడా కాంగ్రెస్ జాప్యానికి కారణమదే.. కానీ ఎంతో ఆశతో పార్టీ పెట్టిన టీజేఎస్ అధినేత కోదండరాం మాత్రం ఈ కాంగ్రెస్ నాన్చివేతకు బలైపోతున్నారు. అసలే కొత్త పార్టీ.. కొత్తగా ముందుకెళ్లి నాలుగు సీట్లు సంపాదించుకుందామంటే కాంగ్రెస్ ఇవ్వడం లేదు. జనాల్లో అభ్యర్థులెవరు తెలియక.. ఎక్కడ పోటీచేస్తామో చెప్పలేక కోదండరాం బలైపోతున్నారు. దీనిపై ఆయన శుక్రవారం వరకు కాంగ్రెస్ కు అల్టీమేటం ఇచ్చారు.తాజాగా సీపీఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి - నారాయణతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం భేటి అయ్యారు. కాంగ్రెస్ కు సీపీఐ - టీజేఎస్ లు వార్నింగ్ ఇచ్చాయి. అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే శుక్రవారం తమ దారి తాము చూసుకుంటామని తేల్చిపారేశారు. సీపీఐ - టీజేఎస్ లు మినీ కూటమిగా ఏర్పడి తెలంగాణ ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించాయి. కానీ పుణ్యకాలం కాస్త అయిపోయాక ఇప్పుడు పెద్దగా పేరు - బలం లేని ఈ పార్టీలు గెలుస్తాయా లేదా అన్న భయం వెంటాడుతోంది. అదే కాంగ్రెస్ బలం కలిస్తే ఖచ్చితంగా గెలిచే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఆచితూచి కాంగ్రెస్ కు వార్నింగ్ ఇచ్చి సీట్లు సాధించుకోవాలని స్కెచ్ వేస్తున్నాయి.

కానీ కాంగ్రెస్ వ్యూహం మాత్రం వేరేగా ఉంది. జాప్యంతో కాంగ్రెస్ కే లాభంలా ఉంది. కాంగ్రెస్ రెబల్స్ కు చెక్ పెడుతుంది. అదే సమయంలో సీపీఐ - టీజేఎస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు పడుతుంది. కానీ ఈ రెండు పార్టీల అభ్యర్థులు చివరి నిమిషం వరకూ తేలకపోతే వారికి నష్టం.. జనాల్లో పెద్దగా పరిచయం - పాపులారిటీ లేని టీజేఎస్ నేతలు ఎన్నికల్లో గులాబీ పార్టీ దూకుడును అందుకోలేరనే ఆందోళన కోదండరాంలో ఉంది. అందుకే జాప్యం కాంగ్రెస్ కు వరంలా ఉండగా.. సీపీఐ - ముఖ్యంగా కోదండరాం పార్టీకి గుదిబండగా మారింది. ఇప్పుడు మహాకూటమి సీట్ల జాప్యంతో ‘బలి’చక్రవర్తిలా కోదండరాం మిగిలిపోయే ప్రమాదంలో పడ్డారట..