ఇక ఉపగ్రహాల యుద్ధం చూస్తాం

Wed Jan 11 2017 11:15:30 GMT+0530 (IST)

బ్రహ్మోస్ ఎయిరోస్పేస్ సృష్టికర్త - ప్రముఖ శాస్త్రవేత్త ఏ శివథాను పిళ్లై భవిష్యత్ లో ఒకవేళ యుద్ధాలు జరిగితే ఎలాంటి పరిస్థితి ఉంటుందనే విషయంలో కొత్త విశ్లేషణ చేశారు. ముంబైలోని విలే పార్లే సబర్బన్ లోని ఓ కాలేజీలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో సరిహద్దులో సైన్యాన్ని మోహరించి యుద్ధాలు జరిగే పరిస్థితి ఉండదని తెలిపారు. ఒకవేళ రానున్న కాలంలో యుద్ధాలు గనుక జరిగితే అది ఉపగ్రహానికి - ఉపగ్రహానికి మధ్య  అంతరిక్షంలో జరుగుతాయని పిళ్లై విశ్లేషించారు.

గతంలో జరిగిన సాధారణ యుద్ధరీతుల కంటే సముద్ర గర్భంలో అణు జలాంతర్గాముల పోరాటం జరుగుతుందని పిళ్లై తెలిపారు. వీటన్నింటి కంటే సైబర్ వార్ ప్రధానంగా మారుతుందని హెచ్చరించారు. కూర్చున్న చోటే బటన్ నొక్కితే సరిహద్దులో జరగాల్సింది జరిగిపోతుంది - సమాచార యుద్ధ తంత్రమే ఒక ప్రపంచాన్ని శాసిస్తుంది అని తెలిపారు. ఆదిత్య ప్రాజెక్ట్ పేరుతో సూర్యుడిపై అధ్యయనం - చంద్రుడిపైన భారతీయుడు కాలుమోపే ప్రక్రియపై విస్తృత పరిశోధన జరుగుతున్నదని శివథాను పిల్లై తెలిపారు. అందులో భాగంగానే 2017లో డిసెంబర్ లో చంద్రుడిపైకి రోవర్ ను పంపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. చంద్రుడికి అవతల ఉన్న మార్స్ గ్రహంపై మనం పంపిన మంగళ్ యాన్ చాలా స్వేచ్ఛగా చక్కర్లు కొడుతున్నదని రాబోయే కాలంలో అంగారకుడు - చంద్రుడిపైకి మరిన్ని అంతరిక్ష యాత్రలు చేపట్టునున్నామని పేర్కొన్నారు. శుక్ర గ్రహంపైకి యాత్ర చేపట్టడమే ఇక తదుపరి కార్యాచరణ అని ఆయన విశ్లేషించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/