పవన్ కు కర్ణాటక మాదే అని బీజేపీ ముందే చెప్పిందట

Thu May 17 2018 21:46:30 GMT+0530 (IST)

ఆర్నెళ్లు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. 2014 ఎన్నికల నాటి నుంచి మొన్న విడిపోయేంత వరకు కలిసి తిరిగిన ఫలితమో ఏమో కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఏపీ సీఎం చంద్రబాబులా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. అంతా తనకు తెలిసే జరుగుతోందంటున్నారు. ప్రచురణ కావడానికి పదేళ్ల ముందే పుస్తకాలు చదివేసిన ఘనత సాధించిన పవన్ కర్ణాటక రాజకీయాల విషయంలోనూ ఇప్పుడు జరుగుతున్నదంతా తనకు ముందే తెలుసని చెప్తున్నారు. 104 కాదు కదా 85 సీట్లు వచ్చినా కూడా బీజేపీయే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తనకు నెల రోజుల ముందే తెలుసని అంటున్నారు. మరి.. 2019 ఎన్నికల్లో ఏపీలో ఏమవతుందన్నది కూడా ఆయన అదే నోటితో చెప్తే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు.
    
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ముందే తనకు తెలుసని.. కొందరు అధికారులు తనకు  నెల రోజుల క్రితమే చెప్పారన్నారు. బీజేపీకి 85 సీట్లు వచ్చి.. జేడీఎస్‌కి 40 సీట్లు వచ్చినా.. బీజేపీదే అధికారమని వాళ్లు తనతో అన్నారని పవన్ చెప్పారు. ఇది తప్పా ఒప్పా అంటే అందరిలోనూ లోపాలున్నాయన్నారు. దశాబ్దాలుగా ప్రజాస్వామ్య పద్ధతులను నీరుగార్చారని.. ఇవాళ కర్ణాటకలో జరుగుతున్నది దానికి మరో ఉదాహరణ అని తెలిపారు.
    
బీజేపీ మాత్రమే కాదని టీడీపీ వైసీపీ ఇలా అన్ని పార్టీలు చేస్తున్నాయన్నారు. బేరసారాలకు చరమాంకం పలకాలని కోరుకునేవారిలో తానూ ఒకడినన్నారు పవన్. అవును.. మరి.. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ నుంచి అదృష్టవశాత్తు ఎవరైనా గెలిస్తే వారిని టీడీపీ ఎగరేసుకుపోతే కష్టం కదా.