Begin typing your search above and press return to search.

నటన రాదు రాజకీయం తెలియదు:కిషన్ రెడ్డి

By:  Tupaki Desk   |   13 Feb 2018 1:22 PM GMT
నటన రాదు రాజకీయం తెలియదు:కిషన్ రెడ్డి
X
జ‌న‌సేన అధ్య‌క్షుడు - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ....కొద్ది రోజుల నుంచి పూర్తి స్థాయి స‌మ‌యాన్ని రాజ‌కీయాల‌కు కేటాయిస్తోన్న సంగతి తెలిసిందే. కొండ‌గ‌ట్టులో మూడు రోజులు ప‌ర్య‌టించిన ప‌వ‌న్ ఆ త‌ర్వాత అనంతపురం లో ప‌ర్య‌టించి ఇటు ఏపీ...అటు తెలంగాణ‌ల‌ను క‌వ‌ర్ చేస్తున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఇరు తెలుగు రాష్ట్రాల‌లో పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ స్పష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఏపీలో సంగ‌తి ఎలా ఉన్నా...తెలంగాణ‌లో ప‌వ‌న్ ప‌ర్య‌టిస్తుండ‌గానే అత‌డిపై మాట‌ల దాడి మొదలైంది. తెలంగాణ‌పై - సీఎం కేసీఆర్ పై ప‌వ‌న్ కు ఉన్న‌ట్లుండి ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకువ‌చ్చిందంటూ ప‌లువురు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శలు గుప్పించారు. తెలంగాణ‌లో ప‌వ‌న్ పోటీ చేసినా పెద్ద‌గా ప్ర‌భావం ఉండబోద‌ని బీజేపీ ప్ర‌తినిధి చైతన్య కామెంట్ చేశారు. తాజాగా, ప‌వ‌న్ పై బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు న‌టించ‌డ‌మే రాద‌ని, ఆయ‌న రాజ‌కీయ నాయ‌కుడిగా ప‌నికిరాడ‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. హైద‌రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన కిష‌న్ తెలంగాణ రాజ‌కీయాల గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

ప‌వ‌న్ కు యాక్టింగ్ రాద‌ని - ఆయన హావభావాలు చూస్తే త‌న‌కు నవ్వొస్తుందని కిష‌న్ రెడ్డి అన్నారు. ఆయ‌న అన్నయ్య‌ చిరంజీవిని అడ్డుపెట్టుకుని ప‌వ‌న్ సినిమా హీరో అయ్యాడని చెప్పారు. అదేవిధంగా మీడియా మద్దతుతో రాజకీయ నాయకుడిగా ఎదుగుదామ‌ని చూస్తున్నార‌ని అన్నారు. ఓ మాట‌లో చెప్పాలంటే పవన్ కన్నా ఆయన అన్నకొడుకు మంచి నటుడని షాకింగ్ కామెంట్స్ చేశారు. కత్తి మహేశ్ వంటి వ్య‌క్త‌లకు మీడియానే పాపులర్ చేసింద‌న్నారు. సీనియ‌ర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డికి పార్టీలో పెద్ద‌పీట వేశామ‌ని - పార్టీ స్టాండ్ ను కాద‌ని కూడా ఆయనకు - ఆయన కుమారుడికి గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చామన్నారు. ఏపీలో టీడీపీ కొత్త‌పాట పాడుతోంద‌ని - బీజేపీతో పొత్తు ర‌ద్దు చేసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికే నష్టమన్నారు. కాంగ్రెస్ లో చేరిన కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి....బీజేపీలో సెట్ అవ‌లేర‌న్నారు. బీజేపీ క్రమశిక్షణ గ‌ల పార్టీ అని, వ్య‌క్తిగత దూషణల‌ను తాము స‌హించ‌బోమ‌ని చెప్పారు. కేంద్రంపై సీఎం కేసీఆర్ వైఖ‌రి అస్ప‌ష్ట‌మ‌ని, ఆయ‌న డూప్ ఫైటింగ్ చేస్తున్నాడని మండిప‌డ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్ - బీజేపీ - టీఆర్ ఎస్ ల మ‌ధ్యే త్రిముఖ పోటీ ఉంటుంద‌ని, త‌మ పార్టీ బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రణాళిక సిద్ధం చేశామ‌న్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో అమిత్ షా తరచూ తెలంగాణలో పర్యటిస్తారన్నారు. ఉన్న‌ప‌ళంగా ఎన్నిక‌లు జ‌రిగితే తెలంగాణ‌లో హంగ్ రావ‌చ్చ‌ని అన్నారు. మార్చి నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్ర చేప‌ట్టే యోచ‌న‌లో ఉన్నామ‌న్నారు.