పద్మినీరెడ్డి బీజేపీ సానుభూతిపరురాలేనట

Fri Oct 12 2018 21:33:12 GMT+0530 (IST)

కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ సతీమణి పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడం - తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు ప్రకటించడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ శ్రేణులు నష్టనివారణ చర్యలు చేపడుతున్నాయి.బీజేపీ సీనియర్ నేత - మాజీ శాసససభాపక్ష నాయకుడు కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్మినీరెడ్డి తమ పార్టీలో చేరి తిరిగి కాంగ్రెస్‌లో చేరడంతో తమకు నష్టమేమీ లేదని ఆయన తెలిపారు. ఆమె బీజేపీ సానుభూతిపరురాలేనని వ్యాఖ్యానించారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శుక్రవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘పద్మినీరెడ్డి బీజేపీ సానుభూతిపరురాలు. నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా అనేక సార్లు చేరిక గురించి మాట్లాడారు. పార్టీలో చేరాలని వచ్చింది. చేర్చుకున్నాం. ఆమెకు ఏం ఇబ్బంది వచ్చిందో ఏమో తిరిగి కాంగ్రెస్ లో చేరింది.ఇందులో ఆశ్చర్యం - ఆందోళన ఏం లేదు. ఒక్కశాతం కూడా నష్టం లేదు’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టూర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎవరి పార్టీ నుంచి ఇతర పార్టల్లో నేతలు చేరుతున్నారో గమనించాలని అన్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని కిషన్ రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ కోర్టులు కేసులు.సంస్థల పేర్లు చెప్పి శాసనసభను రద్దు చేసానని చెప్పడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఇన్నిసార్లు హైకోర్టులో మొట్టికాయలు వేయించుకున్న ప్రభుత్వం మరొకటి లేదని ఆయన స్పస్టం చేశారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా పంచాయితీ చట్టానికి..రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా..కేసీఆర్ ప్రభుత్వం ప్రవర్తించింది. అందుకే... హైకోర్టు తప్పుపట్టిందని వెల్లడించారు. పార్టీలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించాలని ఆయన కోరారు.