Begin typing your search above and press return to search.

కిష‌న్ రెడ్డి మాట‌లు నిజ‌మేగా కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   25 Oct 2016 7:18 AM GMT
కిష‌న్ రెడ్డి మాట‌లు నిజ‌మేగా కేసీఆర్‌?
X
సామెత‌ల‌తో తిట్టిపోయ‌టం ఒక క‌ళ‌. తాను చెప్పాల‌నుకున్న విష‌యం మొత్తాన్ని ఒక సామెత‌గా మార్చేసి ప్ర‌త్య‌ర్థిపై విరుచుకుప‌డే త‌త్వం తెలంగాణ బీజేపీ సీనియ‌ర్ నేత కిష‌న్ రెడ్డికి అల‌వాటు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ హ‌యాంలో కిష‌న్‌ రెడ్డి జోరు ఓ రేంజ్లో ఉండేది. రోజువారీగా వైఎస్ తీరును త‌ప్పు ప‌ట్టేవారు. ఒక‌ద‌శ‌లో.. కిష‌న్‌ రెడ్డి వ‌ర్సెస్ వైఎస్ అన్న‌ట్లుగా విష‌యాలు సాగట‌మే కాదు.. రాజ‌కీయాలు దాటేసి వ్య‌క్తిగ‌త అంశాల విష‌యంలోనూ వీరి మ‌ధ్య శ‌త్రుత్వం పెరిగిన‌ట్లుగా చెబుతుంటారు.

వైఎస్ అకాల మ‌ర‌ణం త‌ర్వాత కిష‌న్ రెడ్డి మ‌ళ్లీ ఆస్థాయిలో గ‌ళం విప్పింది లేద‌న్న విమ‌ర్శ ఉంది. తెలంగాణ అధికార‌ప‌క్షంపై సాఫ్ట్ కార్న‌ర్ తో వ్య‌వ‌హ‌రిస్తార‌న్న ఆరోప‌ణ కూడా ఆయ‌న‌పై ఉంది. కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై తెలంగాణ అధికార‌ప‌క్ష నేత‌లు విరుచుకుప‌డుతున్నా.. కిష‌న్ రెడ్డి మాత్రం వారిపై ఫైర్ కావ‌టం లేద‌న్న ఆరోప‌ణ ఉంది. ఇలాంటి వేళ‌.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై కిష‌న్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.
తిన‌టానికి తిండి లేదు కానీ మీసాల‌కు సంపెంగ నూనె? అంటూ సామెత‌తో కేసీఆర్‌ పై చెల‌రేగిపోయిన ఆయ‌న‌.. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని ఉంటే.. అన‌వ‌స‌ర ఖ‌ర్చుతో మ‌రింత భారం పెరిగేలా ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు నిధులు ఇవ్వ‌ని తెలంగాణ రాష్ట్ర‌ స‌ర్కారు.. రాష్ట్ర స‌చివాల‌యం.. అసెంబ్లీ భ‌వ‌నాల్ని కూల్చేసి.. కొత్త క‌ట్ట‌డాల‌ను నిర్మించాల‌ని అనుకోవ‌టం ఏ మాత్రం స‌రికాద‌ని ఆయ‌న ఫైర్ అవుతున్నారు. నిజాం నియంతృత్వ అడుగుజాడ‌ల్లో పయ‌నిస్తూ.. ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేసే నిర్ణ‌యాల‌పై ఆయ‌న తీవ్రంగా విరుచుకుప‌డ్డారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో 23 జిల్లాల‌కు.. 294 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు స‌రిపోయిన అసెంబ్లీ భ‌వ‌నం.. విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌రాష్ట్రానికి స‌రిపోక‌పోవ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నించారు. స‌చివాల‌యం వాస్తు బాగోక‌పోతే.. తెలంగాణ రాష్ట్రం ఎందుకు వ‌చ్చింద‌ని సూటిగా ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. వాస్తు బాగోక‌పోతే..టీఆర్ ఎస్ పార్టీ ఎలా గెలిచింద‌న్న‌సందేహాన్ని వ్య‌క్తం చేశారు. త‌మ పార్టీ కానీ గెలిస్తే.. తెలంగాణ‌కు ద‌ళితుడే మొద‌టి ముఖ్య‌మంత్రి అవుతార‌ని చెప్పిన మాట‌ను నిల‌బెట్టుకోకుండా మీరే ముఖ్య‌మంత్రి అయ్యార‌ని కేసీఆర్‌ను ప్ర‌శ్నించారు. వాస్తు బాగోక పోతే.. కేసీఆర్ కుటుంబ స‌భ్యులు మంత్రులు.. ఎంపీలు ఎలా అవుతార‌న్న కిష‌న్‌ రెడ్డి.. వాస్తు దోషాలు ఉంటే స‌రి చేసుకోవాలే త‌ప్పించి కూల‌గొట్టేయ‌టం స‌రికాద‌న్నారు. నిజ‌మే..కిష‌న్ రెడ్డి విమ‌ర్శ‌లు విన్న‌ప్పుడు నిజ‌మే క‌దా కేసీఆర్ అన్న బావ‌న‌ క‌ల‌గ‌టం ఖాయం. మ‌రి..కిష‌న్ రెడ్డి లాంటి వార సందేహాల‌కు కేసీఆర్ ఇచ్చే స‌మాధానాలు ఏమిటి?అన‌్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/