Begin typing your search above and press return to search.

ఊస‌ర‌వెల్లిలా రంగుమారుస్తున్న బాబు!!

By:  Tupaki Desk   |   22 Sep 2018 12:20 PM GMT
ఊస‌ర‌వెల్లిలా రంగుమారుస్తున్న బాబు!!
X
తెలంగాణలో ముంద‌స్తు ఎన్నిక‌ల హీట్ పెరుగుతోంది. షెడ్యూల్ విడుద‌ల కాకముందే ఆయా పార్టీలు విమ‌ర్శ‌లు చేసుకుంటూ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నామ‌ని వెల్ల‌డించారు. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఓటరును కలిసి కేంద్ర పథకాలు వివరిస్తామ‌ని - టీఆర్ ఎస్ ప్రభుత్వాలు ప్రజల్లో ఎండగడుతామ‌ని అన్నారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా రెండవ సభ కరీంనగర్లో ఉంటుంద‌ని కిష‌న్ రెడ్డి వివ‌రించారు. ఈ సభ విజయవంతం చేయడానికి పార్టీ సీనియ‌ర్లు లక్ష్మణ్ - దత్తాత్రేయ - మురళీధర్ రావు అందరం క‌లిసి క‌ట్టుగా ముందుకు సాగుతున్నామ‌న్నారు. కర్ణాటక ఎన్నికల్లో పాల్గొన్న సంతోష్ కూడా ఇక్కడే ఉండి ఎలక్షన్ క్యాంపెయిన్‌ స్టార్ట్ చేస్తామ‌ని వివ‌రించారు.

రాష్ట్రంలోని ప‌రిణామాల‌పై కిష‌న్ రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో మహాకూటమి పేరుతో టీడీపీ-కాంగ్రెస్‌ లు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని కిష‌న్ రెడ్డి ఆరోపించారు. సీట్ల సర్దుబాటు ఇంకా కానే కాలేదని ఒకే మేనిఫెస్టో పెట్టి ప్రజలకు ఏ విధంగా భరోసా ఇస్తారని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు తీరుపై మండిప‌డ్డారు. ``ఎన్టీఆర్ ఆశయాల పార్టీ టీడీపీని ఏ విధంగా కాంగ్రెస్‌ తో ఏ విధంగా పొత్తు కుదురుస్తావు చంద్ర‌బాబు?వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి - రోశయ్య - కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ గురించి చంద్రబాబు ఏ విధంగా మాట్లాడారు....ఇప్పుడు ఏ విధంగా పొత్తులకు పోతున్నారు?ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న చంద్రబాబు బండారం బయట పడింది. కాంగ్రెస్ ఒక మునుగుతున్న నావ` అని వ్యాఖ్యానించారు.

టీఆర్ ఎస్‌ కు కాంగ్రెస్‌కు తేడా లేదని కిషన్ రెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణను తామే ఇచ్చామ‌ని ఆ పార్టీ నేత గులాంన‌బీ ఆజాద్ వ్యాఖ్యానించ‌డాన్ని ఆయ‌న ఎద్దేవా చేశారు. `తెలంగాణ‌ను కాంగ్రెస్‌ ఇవ్వలేదు. ఆజాద్ తేలేదు. తెచ్చుకున్నది తెలంగాణ ప్రజలు మాత్రమే. ఇలా చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నేతలకు సిగ్గుండాలి. బిల్లు పాస్ అయ్యే సమయంలో కాంగ్రెస్ చేసిన రభస అందరికి తెలుసు. బీజేపీ లేకుంటే తెలంగాణ బిల్లు పాస్ అయ్యేది కాదు తెలంగాన వచ్చేది కాదు` అని వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ ఎస్ ప్ర‌చారంపై కిష‌న్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ``కేటీఆర్ సెంచరీ కొట్టడం ఏమో కానీ టీఆరెఎస్‌ కు ఎన్ని వికెట్లు మిగులుతాయో చూడాలి. ఉత్తర తెలంగాణ సభ తరువాత కేసీఆర్ - కేటీఆర్ సీటు గల్లంతు అవుతుంది. అమిత్ షా పర్యటన తరువాత కెసిఆర్ కుటుంబ వికెట్లు పడిపోతాయి`` అని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్నాటక‌లో సంకీర్ణ రాజకీయాలు నడుస్తున్నాయని - కర్ణాటక ప్రభుత్వంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయని కిష‌న్ రెడ్డి అన్నారు.