Begin typing your search above and press return to search.

ఆకాశానికి న‌ల్లారి కిర‌ణ్ నిచ్చెన‌!

By:  Tupaki Desk   |   13 July 2018 4:18 AM GMT
ఆకాశానికి న‌ల్లారి కిర‌ణ్ నిచ్చెన‌!
X
ఏనాటికైనా... విడిపోయిన తెలుగు రాష్ట్రాల‌ను ఏకం చేస్తా అని ప్ర‌గ‌ల్భాలు ప‌లికి పార్టీ పెట్టిన న‌ల్లారి కిర‌ణ్‌ కుమార్ రెడ్డిని జ‌నం ఓట్ల‌తో వాస్త‌వంలోకి తెచ్చి క‌ళ్లు తెరిపించారు. ఆ దెబ్బ‌తో అజ్ఞాత‌వాసంలో గ‌డిపారు. అస‌లు తెలుగు రాష్ట్రాల్లో అన్నీఅనూహ్య ప‌రిణామాలే. అయితే, ఇంత‌కాలానికి మ‌ళ్లీ ఆయ‌న యాక్టివ్ అయ్యారు. నల్లారి కిర‌ణ్ కుమార్‌ రెడ్డి ఉమ్మ‌డి రాష్ట్రపు చివ‌రి ముఖ్య‌మంత్రి. కాబ‌ట్టి ఇంకో ప్రాంతీయ పార్టీలో చేరే ప‌రిస్థితి లేదు. బీజేపీ లేదా కాంగ్రెస్ రెండే ఆప్ష‌న్లు. కానీ త‌ర‌త‌రాల కాంగ్రెస్ ర‌క్తం బీజేపీలో ఇమ‌డ లేదు. సో చివ‌రికి కాంగ్రెస్‌లోకి వ‌చ్చేశారు. ఈరోజు రాహుల్‌ ను క‌ల‌వ‌నున్నారు. అయితే, అంత‌కుమునుపు ఆయ‌న‌కు త‌గిన గౌర‌వం ఇస్తూ ఏపీ పీసీసీ ఇన్‌ ఛార్జ్ కిర‌ణ్‌ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించారు.

రాజ‌కీయంలో వ‌చ్చారు స‌రే... మ‌రి ఆయ‌న టార్గెట్ ఏంట‌ని ఆరా తీస్తే పెద్ద టార్గెట్టే పెట్టిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో మాజీ కేంద్ర మంత్రి - ఎన్టీఆర్ కూతురు అయిన పురంధేశ్వ‌రిని చిత్తుగా ఓడించి వైసీపీ గెలుచుకున్న రాజంపేట సీటుపై న‌ల్లారి కిర‌ణ్‌ కుమార్‌ రెడ్డి క‌న్ను ప‌డింది. దీనికి కార‌ణం ఆయ‌న మ‌ళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశంలో లేరు. ఇక త‌న నియోజ‌క‌వ‌ర్గం ఉండే ఎంపీ సీటు అయిన రాజంపేట నుంచి పోటీ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ప్రోత్సాహం కూడా ఉంది.

కాంగ్రెస్ ఎందుకు ఆయ‌న‌ను ఎంకరేజ్ చేస్తోంది అంటే దానికీ కొన్ని కార‌ణాలున్నాయి. ఏపీలో కాంగ్రెస్ దాదాపు క‌నుమ‌రుగైంది. ఇపుడు నిల‌బ‌డాలంటే... బ‌ల‌మైన నేత‌ల వ్య‌క్తిగ‌త ప‌ర‌ప‌తిని ఆధారం చేసుకోవాలి. ఆ సెలెక్ష‌న్లో న‌ల్లారి కిర‌ణ్‌ కుమార్ రెడ్డి ఒక ఆప్ష‌న్‌ గా క‌నిపించారు వారికి. ఇక న‌ల్లారి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు త‌న నియోజ‌క‌వ‌ర్గానికి విప‌రీతంగా మేళ్లు చేశారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంతో పాటు చుట్టుప‌క్క‌ల నియోజ‌క‌వ‌ర్గంలో కూడా కొంత సానుకూల‌త ఉంది కాబ‌ట్టి.. గ‌ట్టిగా పోరాడితే ఆ సీటు ద‌క్కుతుందేమో అన్న‌ది న‌ల్లారి-కాంగ్రెస్ ఉమ్మ‌డి ఆలోచ‌న‌. పైగా ఆర్థికంగా కిర‌ణ్‌ కుమార్‌ రెడ్డి చాలా బ‌లంగా ఉన్నారు. ఆయ‌న ప‌ర‌ప‌తిని వాడుతున్నందుకు కాంగ్రెస్ కొన్ని హామీలిచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఒక వేళ గెలిస్తే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే మంత్రి ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం, లేక‌పోతే క‌నీసం రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసే అవ‌కాశాన్ని హామీగా పొందార‌ట‌. అందుకే ఈరోజు రాహుల్‌ ను క‌లుస్తున్నారు.

మ‌రి రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఇంకా కాంగ్రెస్‌ పై కోపం పోలేదు. పైగా జ‌గ‌న్ గాలి వీస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లోనే గెలిచిన రాజంపేట సీటును - ఈసారి వైసీపీ వ‌దులుకునే స‌మస్యే ఉండ‌క‌పోవ‌చ్చని విశ్లేషకుల మాట‌. చ‌తికిల ప‌డిన పార్టీని న‌ల్లారి నిల‌బెడ‌తాడా? లేక దాంతో పాటు తాను కూడా బోల్తా ప‌డ‌తాడా అన్న‌ది చూడాలి.