Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ లోకి కిర‌ణ్‌ కుమార్ రెడ్డి..ఇది ఫైన‌ల్ అట‌

By:  Tupaki Desk   |   24 July 2017 5:17 AM GMT
కాంగ్రెస్‌ లోకి కిర‌ణ్‌ కుమార్ రెడ్డి..ఇది ఫైన‌ల్ అట‌
X
తెలుగు రాజకీయాల్లో స్ప‌ల్ప‌కాలం పాటు ఓ వెలుగు వెలిగి అంతే వేగంగా తెర‌మ‌రుగు అయిన సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. ఆయన తిరిగి సొంత గూటికి చేరే అవకాశాలున్నట్టు కిరణ్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. క్రియాశీల రాజకీయాల‌కు దూరం ఉన్న అనంత‌రం ఆయ‌న బీజేపీ గూటికి చేర‌తార‌నే ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కొద్దికాలం క్రితం ఆయ‌న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన‌లో చేరుతార‌ని టాక్ వినిపించింది. కానీ అవ‌న్నీ తెర‌మ‌రుగు అయిపోయి సొంత‌గూడు అయిన కాంగ్రెస్ పార్టీలోకే కిర‌ణ్ కుమార్‌ రెడ్డి చేర‌నున్నార‌ట‌.

ఉధృతంగా సాగిన తెలంగాణ ఉద్య‌మం ప‌లితంగా కేంద్రం చేసిన రాష్ట్ర విభజన తీర్మానాన్ని తిప్పికొట్టి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అసెంబ్లీ సాక్షిగా కిర‌ణ్ కుమార్ రెడ్డి చెప్పి పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై సైద్ధాంతిక సమరం చేశారు. ఆ తరువాత కాంగ్రెస్‌ కు రాజీనామా చేసి జైసమైక్యాంధ్ర పార్టీతో ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే నాటి ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న కిరణ్ తిరిగి కాంగ్రెస్‌ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభవం త‌ర్వాత తొలుత బీజేపీలో చేరాలని భావించినప్పటికీ వెంకయ్య నాయుడు అడ్డుకున్నారని ప్రచారం జరగటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ నాయకత్వం ఆయనకు టచ్‌ లో ఉంటోంద‌ని స‌మాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తనకు కాంగ్రెస్ పార్టీయే సరైనదనే నిర్ణయానికి వచ్చారని, విభజన అంశం తప్ప కాంగ్రెస్ నాయకత్వంతో ఎలాంటి విభేదాలు లేనందున ఆ పార్టీలో చేరేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని కిర‌ణ్ కుమార్ రెడ్డి భావిస్తున్న‌ట్లు స‌మాచారం. పైగా తనను కాంగ్రెస్ పార్టీయే సీఎంను చేసిందన్న విశ్వాసం కిరణ్‌ లో ఇంకా ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వం కిరణ్‌ తో మాట్లాడిందని సమాచారం. వచ్చే నెలలో ఆయనే దీనిపై స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్‌ లో చేరిన తర్వాత కిరణ్‌ కు ఎఐసిసిలో కీలక పదవి ఇస్తారనే హామీ లభించినట్లు కూడా తెలుస్తోంది. మొత్తంగా కిర‌ణ్‌ కుమార్ రెడ్డి క్రియాశీల రాజ‌కీయాల‌పై ఓ క్లారిటీ రానుంద‌ని స‌మాచారం.