కిరణ్ కుమార్ రెడ్డి రీఎంట్రీ ముహూర్తం ఫిక్స్?

Thu Jul 12 2018 19:18:08 GMT+0530 (IST)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి....త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని కొద్ది రోజులుగా పుకార్లు వస్తోన్న సంగతి తెలిసిందే. మాజీ సీఎం కిరణ్ ...కాంగ్రెస్ లో చేరడం లాంచనప్రాయమేనని - ఆల్రెడీ ...ఏఐసీసీ అధ్యక్షుడితో మంతనాలు పూర్తయ్యాయని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే కిరణ్ ...రాహుల్ సమక్షంలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సమావేశం కానున్నారు. ఆ భేటీ తర్వాత పలు కీలకమైన విషయాలు చర్చించిన అనంతరం కిరణ్....కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారట. ఆ భేటీకి ఏపీసీసీ వ్యవహారాల ఇంఛార్జ్ ఊమెన్ చాందీ - ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా హాజరుకానున్నారని సమాచారం. రాహుల్ గాంధీతో చర్చల అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికపై స్పందించే అవకాశం ఉంది.కిరణ్ తో పాటు ఏపీలోని పలువురు సీనియర్ - జూనియర్ రాజకీయ నేతలు కూడా కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని తెలుస్తోంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్టచివరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా కిరణ్  కుమార్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారు. ఆఖరి బంతి ఇంకా పడలేదని....రాష్ట్ర విభజననను చిట్టచివరి నిమిషం వరకు కిరణ్  తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2014 ఎన్నికల సందర్భంగా `జై సమైక్యాంధ్ర` పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ప్రజలు....ఆ పార్టీకి మద్దతు తెలపలేదు. దీంతో ఆ ఎన్నికల్లో ఘోరపరాజయంపాలైన కిరణ్ ....చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. అయితే 2019 ఎన్నికలు సమీపించడం....అక్టోబరులో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు ఊపందుకోవడం...వంటి పరిణామాల మధ్య కిరణ్ అనూహ్యంగా క్రియాశీల రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సొంతగూటికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.