Begin typing your search above and press return to search.

నల్లారి, చిరు.. కాంగ్రెస్ కు షాకిచ్చారు..

By:  Tupaki Desk   |   20 Feb 2019 5:32 AM GMT
నల్లారి, చిరు.. కాంగ్రెస్ కు షాకిచ్చారు..
X
ఏపీలో కాంగ్రెస్‌ నామరూపాల్లేకుండా పోయిందని అంతా అనుకున్నారు. కానీ పోటీచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తే వెయ్యి అప్లికేషన్లు వచ్చాయి. నేనంటే..నేను పోటీ చేస్తానని అభ్యర్థులు ముందుకు వస్తుండడంతో కాంగ్రెస్ లో సంబరం వచ్చింది. అసలు పార్టీ పూర్తిగా తుడిచిపోట్టుకుపోతుందా..? అన్న తరుణంలో ఈ రేంజ్‌లో దరఖాస్తులు రావడంతో ఏపీసీసీ పెద్దల్లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటి వరకు బాగానే ఉంది. కానీ కాంగ్రెస్‌ నుంచి ఆ ఇద్దరు సీనియర్‌ నేతలు మాత్రం పోటీ చేయడానికి ఇష్టపడడం లేదట. ఒకరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాగా.. మరొకరు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి. వీరు ఎమ్మెల్యేగా గానీ, ఎంపీగా గానీ పోటీ చేసేందుకు ఎలాంటి దరఖాస్తు పెట్టలేదట. దీంతో వారి నిర్ణయం వెనుక మర్మమేమిటని కాంగ్రెస్‌ నాయకుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

2014 ఎన్నిల్లో 'జై సమైక్యాంధ్ర' పేరుతో పార్టీ పెట్టుకొన్న నల్లారి కిరణ్‌ రెడ్డి ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఆ తరువాత పొలిటికల్‌ గా యాక్టివ్‌ గా లేని కిరణ్‌ కుమార్‌ రెడ్డి గత ఏడాది రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరారు. తనతో పాటు పార్టీ వీడిన వారిని మళ్లీ కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ లోకి తీసుకువస్తారని అంతా ఆశించారు. కానీ నల్లారి ఉత్సాహం పార్టీలో ఎక్కడా కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి లాస్ట్‌ బాల్‌ వరకు బ్యాటింగ్‌ కొనసాగుతుందన్న డైలాగ్‌ అప్పట్లో పేలిపోయింది. అయితే ఏపీ కాంగ్రెస్‌ లో కూడా అదే విధంగా ఊపు తీసుకొస్తారని భావించిన కాంగ్రెస్‌ నేతల్లో నల్లారి నిరాశ పర్చారని అంతా అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తులు పెట్టుకోవాలని కాంగ్రెస్‌ కోరింది. అయితే ఊహించిన దాని కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినా నల్లారి మాత్రం దరఖాస్తు పెట్టుకోలేదట. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయడని తెలిసిపోతుంది. కానీ ఎన్నికల సమయంలో పార్టీల్లో ఉత్సాహం నింపుతారని పార్టీ పెద్దలు అంటున్నారు. అయితే పార్టీ కోమాల్లో ఉన్నప్పుడు ఇలాంటి కీలక నేతలు దూరంగా ఉండడంపై ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కాంగ్రెస్‌ నాయకులు మథనపడుతున్నారు. నల్లారి మాత్రం పోటీ చేసి ఓటమి పాలై పరువు తీసుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నారా..? అని చర్చించుకుంటున్నారు.

ప్రత్యేక హోదా కేంద్రంగా ఏపీ కాంగ్రెస్‌ మరో సమరానికి నడుం బిగించింది. ప్రత్యేక హోదా భరోసా ప్రజా యాత్రను అనంతపురం నుంచి మొదలు పెట్టింది. ఈ యాత్రలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొనబోతున్నారు. ఈ యాత్ర ప్రారంభంలో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు పాల్గొంటే నల్లారి మాత్రం కనిపించలేదు. దీంతో ఈ విషయంపై కాంగ్రెస్‌లో జోరుగా చర్చసాగుతోంది.

అలాగే మరో నేత మెగాస్టార్‌ చిరంజీవి కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. ఆయన కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసేందుకు ఎలాంటి దరఖాస్తు పెట్టుకోలేదట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిరంజీవిని ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయిన్‌ లిస్టులో చేర్చింది. కానీ అయినా పార్టీ తరుపున ప్రచారం చేయలేదు. పార్టీ అధ్యక్షుడు తెలంగాణలో జోరుగా పర్యటించినా చిరంజీవి ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన జనసేనకు మద్దతు ఇస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ కు దరఖాస్తు చేసుకోకపోవడంతో ఆయన కాంగ్రెస్‌ తరుపున పోటీ చేయనని చెప్పకనే చెప్పినట్లేనని అనుకుంటున్నారు.