బాబు చేయలేని పని చేస్తానంటున్న యంగ్ ఎంపీ

Mon Apr 16 2018 19:30:46 GMT+0530 (IST)

ఏపీ ప్రత్యేక హోదా విశాఖ రైల్వేజోన్ వంటి విషయాల్లో కేంద్రం అనుసరించిన వైఖరిపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. హోదా పోరులో రాజకీయ పార్టీలు ఎవరికి వారు మైలేజి కోసం ప్రయత్నిస్తున్నా పాలక టీడీపీ నుంచి మాత్రం పదునైన వ్యూహాలు కొరవడుతున్నాయి. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష యత్నం చేశారు.. కానీ టీడీపీ ఎంపీలు మాత్రం కనీసంరాజీనామాలు కూడా చేయలేదు. హోదా పోరును తీవ్రతరం చేయాలని పలువురు టీడీపీ ఎంపీలు భావిస్తున్నా చంద్రబాబు అనుమతి లేకపోవడంతో వారేమీ చేయలేని పరిస్థితి. అయితే... టీడీపీ కుర్ర ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒక అడుగు ముందుకేయడానికి రెడీ అయ్యారు. ఏపీలోని విపక్షాలు ఈ రోజు బంద్ పాటిస్తున్న సమయంలో తాము కూడా రాష్ట్ర ప్రయోజనాలు - ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం పోరాడాలని గట్టిగా భావిస్తున్న రామ్మోహన్ దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నారు.
    
ఈ క్రమంలో ఆయన తన సొంత నియోజకవర్గం శ్రీకాకుళంలోని ప్రధాన రైల్వే స్టేషన్ శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస)లో దీక్ష చేపట్టారు. రాత్రంతా ఆయన తన దీక్షను కొనసాగించనున్నారు.
    
ఏపీ ప్రత్యేక హోదాతో పాటు రైల్వేజోన్ కోసం పోరాడుతున్న ఆయన గత పార్లమెంటు సమావేశాల్లో రైల్వేజోన్ కోసం ప్రయివేట్ మెంబర్ బిల్లు కూడా ప్రవేశపెట్టారు. పార్లమెంటు సాక్షిగా టీడీపీ ఎంపీలు చేసిన నిరసనల్లోనూ ఆయనే కాస్తంత దూకుడు చూపారు. ఇప్పుడు ఆయన రైల్వేజోన్ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ అనుకూలంగా లేనప్పటికీ స్వయంగా దీక్షకు దిగుతుండడం విశేషం.
    
మరోవైపు ఏపీ సీఎం - టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 20న ఒక రోజు దీక్ష చేపట్టనున్న సమయంలో ఆయన కంటే ముందే రామ్మోహన్ ఈ దీక్ష చేపట్టడం విశేషం.