బాబుతో పాటు రాహుల్ కు షాక్!..వైసీపీలోకి మాజీ మంత్రి!

Tue Feb 19 2019 09:59:10 GMT+0530 (IST)

ఎన్నికల వేళ ఏపీలో విపక్ష వైసీపీకి మంచి జోష్ వచ్చేసిందనే చెప్పాలి. గడచిన ఎన్నికల్లోనే వెంట్రుకవాసిలో అధికారాన్ని మిస్ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఈ దఫా ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చాలా పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉండిపోయిన జగన్... అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట తమ పార్టీ టికెట్లపై విజయం సాధించిన ఎంపీలు - ఎమ్మెల్యేలను లాగేసుకున్నా కిమ్మనకుండా ఉండిపోయిన జగన్... ఇప్పుడు టీడీపీకి అసలు సిసలు సినిమా చూపిస్తున్నారనే చెప్పాలి. ఇప్పటికే టీడీపీకి దెబ్బ మీద దెబ్బ పడిపోతుండగా... ఇప్పుడు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ వంతు వచ్చేసిందని చెప్పాలి.ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా నిలిచిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఇప్పుడు వైసీపీలో చేరిపోయేందుకు దాదాపుగా రంగం సిద్ధ చేసుకుంటున్నారట. ఇప్పటికే వైసీపీకి చెందిన విశాఖ నేతలతో చర్చలు జరిపిన కృపారాణి... వైసీపీలోకి చేరేందకు మార్గం సుగమం చేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన లండన్ టూర్ ను ముగించుకుని రాగానే.. ఆయనతో భేటీ అయ్యేందుకు కూడా కిల్లి కృపారాణి రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. ఈ దెబ్బతో ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటుగా... తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి కూడా షాకిచ్చేందుకు వైసీపీ రంగం సిద్ధం చేసిందనే చెప్పాలి.