Begin typing your search above and press return to search.

అచ్చెన్న గెలవడానికి వైసీపీ మహిళా నేతే కారణమట!

By:  Tupaki Desk   |   23 Jun 2019 6:34 AM GMT
అచ్చెన్న గెలవడానికి వైసీపీ మహిళా నేతే కారణమట!
X
ఆంధ్రప్రదేశ్‌ లో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ.. ఆ పార్టీకి ఏకంగా 151 సీట్లు వచ్చాయి. ఇక, అధికార తెలుగుదేశం పార్టీకి 23 - ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన జనసేనకు ఒక్క స్థానం దక్కింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు తోడు - జగన్‌ కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న నినాదం వల్లే ఈ రకమైన ఫలితాలు వెలువడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు గడిచినా కొన్ని చోట్ల ఆ తాలూకు వాతావరణమే కనిపిస్తోంది.

ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఇది మరింత ఎక్కువగా ఉంది. దీనికి కారణం అచ్చెన్నాయుడు విజయం వస్తున్న వార్తలే. శ్రీకాకుళం టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు వరుసగా రెండోసారి విజయం సాధించారు. 8,857 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి పేరాడ తిలక్‌పై విజయం సాధించాడు. కౌంటింగ్ సమయంలో మొదటిరౌండ్లలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నప్పటికీ చివరి రౌండ్లలో మంచి ఓట్లు వచ్చి అచ్చెన్నాయుడు గెలుపొందారు. అయితే, ఈ ఓట్లు కేంద్ర మాజీ మంత్రి - వైసీపీ నాయకురాలు డాక్టర్‌ కిల్లి కృపారాణి వల్లే పోలయ్యాయన్న ప్రచారం జరుగుతోంది.

పేరాడ తిలక్‌ కు వ్యతిరేకంగా పని చేయడం వల్లే అక్కడ అచ్చెన్నాయుడు విజయం సాధించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఇటీవల జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో తన ఓట‌మికి కిల్లి కృపారాణి కూడా ఓ కార‌ణం అని పేరాడ తిలక్ మాట్లాడటం పై వార్తలకు బలం చేకూర్చుతోంది. అంతేకాదు, ఆయన ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ దృష్టికి తీసుకెళ్తానని అన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది. ఇది వైసీపీ నాయకుల్లో అందోళన కలిగిస్తోంది.

కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి ఎన్నికలకు ముందు హైదరాబాద్‌ లోని లోటస్‌ పాండ్‌ లో వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆమెకు జగన్‌ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. అయితే, ఆమె చేరికను ఆ పార్టీ నాయకులే స్వాగతించలేదు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయింది. ఆమె చేరిక కార్యక్రమానికి సైతం శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం కన్వీనర్‌ దువ్వాడ శ్రీనివాస్‌ - అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ గా వ్యవహరిస్తున్న పేడాడ తిలక్‌ - ఇతర క్రియాశీలక నాయకులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో ఈ పరిణామం ఏపీలో చర్చనీయాంశం అయింది.