Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే కిడారిని అలా చంపార‌ట‌!

By:  Tupaki Desk   |   24 Sep 2018 6:42 AM GMT
ఎమ్మెల్యే కిడారిని అలా చంపార‌ట‌!
X
సంచ‌ల‌నం సృష్టించిన అర‌కు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమల్ని మావోలు దారుణంగా హ‌త‌మార్చిన వైనం తెలిసిందే. ఈ ఉదంతంలో ప్ర‌త్య‌క్ష సాక్షి అయిన ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌రావు వాహ‌న డ్రైవ‌ర్ జ‌రిగిన ఉదంతం గురించి చెప్పుకొచ్చారు. జ‌రిగిన ఉదంతాన్ని అత‌డి మాట‌ల్లోనే చూస్తే..

+ అర‌కులో 11.20 గంట‌ల‌కు బ‌య‌లుదేరాం. ఘ‌ట‌నాస్థ‌లానికి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల మ‌ధ్య‌లో చేరుకున్నాం. మ‌ధ్య‌లో దుమ్రిగూడ‌లో వాట‌ర్ బాటిల్స్ తీసుకున్నాం. ఒక్క‌సారిగా వాహ‌నం చుట్టుముట్టేశారు. బండి ఆపేయాల‌న్నారు. బండిని ముందుకు తీసుకెళితే.. కాలుస్తామ‌న్నారు.

+ వారు బండిని చుట్టుముట్ట‌గానే.. బండి ఆపాల‌ని సార్ చెప్పారు. బండి చుట్టూ రాగానే.. చ‌చ్చిపోయాంరా మ‌న‌మింకా.. న‌క్స‌ల్స్ కు దొరికిపోయామ‌ని ఎమ్మెల్యేగారు అన్నారు. వాహ‌నం ఆపిన వెంట‌నే ఎమ్మెల్యే కింద‌కు దిగి.. చేతులు పైకి ఎత్తారు. ఎమ్మెల్యేగారి నోటి నుంచి వ‌చ్చిన ఆఖ‌రు మాట ఇదే.

+ ఎమ్మెల్యే గారి వాహ‌నం ముందు ఉంటే.. మాజీ ఎమ్మెల్యేగారి వాహ‌నం వెనుక ఉంది. న‌క్స‌ల్స్ మ‌మ్మ‌ల్ని చుట్టి ముట్టినంత‌నే.. వెనుక ఉన్న మాజీ ఎమ్మెల్యే వాహ‌నం వెన‌క్కి తిప్పే ప్ర‌య‌త్నం చేశారు. కానీ.. కాల్చేస్తామ‌ని చెప్ప‌టంతో వాళ్లు కూడా కారు ఆపేశారు.

+ మ‌మ్మ‌ల్ని..గ‌న్ మెన్ల‌ను కింద‌కు దింపారు. గ‌న్ మెన్ల ద‌గ్గ‌ర గన్ లు తీసుకున్నారు. ఏ మాత్రం క‌దిలినా కాల్చేస్తామ‌న్నారు. దీంతో.. ఎవ‌రూ ముందుకు అడుగు వేయ‌లేదు. పార్టీ మారిన‌ప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చార‌ని అడిగారు. మాకు తెలీద‌ని చెప్పాం. ఎమ్మెల్యేగారి చేతులు వెన‌క్కి క‌ట్టేసి ముందుకు తీసుకెళ్లారు.

+ కారును చుట్టుముట్టిన వారు 30-40 మంది వ‌ర‌కు ఉండొచ్చు. లెక్క పెట్ట‌లేదు కానీ.. వ‌చ్చిన వారిలో ఎక్కువ మంది మ‌హిళ‌లే ఉన్నారు. ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యేను ముందుకు తీసుకెళ్లారు. ఆ టైంలో అటువైపు వాహ‌నాల మీద వెళ్లే వారిని ఆపి వారితో మాట్లాడారు. ప్ర‌జాధ‌నాన్ని దోచుకుంటున్నార‌ని చెప్పారు. అంత‌లోనే.. వేరే వాళ్లు కాల్చేశారు. మొద‌ట మాజీ ఎమ్మెల్యేను కాల్చారు. ఆ త‌ర్వాత ఎమ్మెల్యే గారిని కాల్చారు. అమ్మా అన్న కేక విన్నాం. మేం వెళ్లి చూడొచ్చా? అంటే కుద‌ర‌ద‌న్నారు. క‌దిలితే కాల్చేస్తామ‌న్నారు. వారు వెళ్లిన త‌ర్వాత వెళ్లి చూశాం. ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాం. అర‌గంట త‌ర్వాత వారు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.