Begin typing your search above and press return to search.

బాబు ప‌ద‌వి ఇచ్చిన ప‌క్క‌రోజు ఏమైందంటే..?

By:  Tupaki Desk   |   14 Feb 2016 10:27 AM GMT
బాబు ప‌ద‌వి ఇచ్చిన ప‌క్క‌రోజు ఏమైందంటే..?
X
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుకు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. మ‌రి.. ముఖ్యంగా తెలంగాణ‌లో ఆ పార్టీ ప‌రిస్థితి ఏమాత్రం బాగున్న‌ట్లు క‌నిపించ‌టం లేదు. ఓప‌క్క ఎన్నిక‌ల్లో ఊహించ‌నంత భారీగా ఎదురుదెబ్బ‌లు.. మ‌రోవైపు పార్టీ నేత‌లు జంపింగ్ లు ఆయ‌న్ను తీవ్రంగా క‌లిచివేస్తున్నాయి. విషాద‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. తెలుగుతమ్ముళ్లు ఇస్తున్న షాకులు ఓ రేంజ్‌ లో ఉండ‌ట‌మే కాదు.. చెప్పుకోవ‌టానికి కూడా ఇబ్బందిక‌రంగా ఉండ‌టం.

మొన్నామ‌ధ్య టీటీడీపీ ఎమ్మెల్యే వివేక్ పార్టీ నుంచి జంప్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇలా జ‌రిగిన ప‌క్క‌రోజున రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్య‌క్షుడు ప్ర‌కాశ్ గౌడ్ రాజేంద్ర‌న‌గ‌ర్‌ లో పార్టీ విస్తృత‌స్థాయి స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న‌.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై విమ‌ర్శ‌లు చేశారు. అది కూడా సింఫుల్ గా కాకుండా కాస్తంత ఘాటుగానే మాట్లాడారు.

ఆయ‌న మాట్లాడిన మాటల్లో శాంపిల్‌ గా ఒక వ్యాఖ్య తీసుకుంటే.. గ్రేటర్‌లో టీడీపీ ఓడిపోలేదని.. టీఆర్‌ ఎస్‌ మోసం చేసి గెలిచిందని చెప్పిన ప్ర‌కాశ్ గౌడ్‌.. టీఆర్ ఎస్ ఈవీఎంలు టాంపరింగ్‌ చేసి గెలిచిందని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల్లో ఓటమి భావన వద్దని.. ఓటమితో కుంగిపోవద్దన్న ఆయ‌న‌.. 2019లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది టీడీపీనే అని న‌మ్మ‌బ‌లికారు. అధికారంలో ఉన్నాం కాబ‌ట్టి..ఏం చేసినా నడస్తుందని సీఎం కేసీఆర్‌ అనుకుంటున్నారని.. అది మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు.

ఇన్ని మాట‌లు చెప్పిన ఆయ‌న రాత్రి అయ్యేస‌రికి సీఎం కేసీఆర్‌ ను క‌లిసి టీఆర్ ఎస్‌ లో చేరిపోవ‌టం గ‌మ‌నార్హం. ఇలా ఉద‌యం ఒక మాట చెప్పి.. సాయంత్రం అయ్యేస‌రికి అధినేత‌కు షాకులివ్వ‌టం ఈ మ‌ధ్య‌న త‌మ్ముళ్లు ఒక అల‌వాటుగా మారింది. తాజాగా అలాంటి ప‌రిణామ‌మే మ‌రొక‌టి చోటు చేసుకుంది.

ఖ‌మ్మం జిల్లాకు చెందిన టీడీపీ నేత పొట్ల నాగేశ్వ‌రావు తాజాగా టీఆర్ ఎస్‌ లో చేరేందుకు స‌మాయుత్త‌మ‌వుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. శ‌నివార‌మే ఆయ‌న‌కు చంద్ర‌బాబు.. ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ ఛార్జ్ గా బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు. అలా బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారో లేదో.. ఆదివారం తెలంగాణ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుతో భేటీ కావ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ప‌ద‌వులు ఇవ్వ‌క‌పోవ‌ట‌మో.. పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌లేద‌న్న అసంతృప్తిలో పార్టీ మార‌టం అర్థం చేసుకోవ‌చ్చు. అలాంటిదేమీ లేకుండా ప‌ద‌వులు ఇచ్చినా పార్టీ మారిపోతున్న త‌మ్ముళ్ల తీరు చంద్ర‌బాబుకు షాకులిస్తుంద‌న‌టంలో సందేహం లేదు.