Begin typing your search above and press return to search.

మద్యం తాగితే ఓటు వేయనీయవద్దు

By:  Tupaki Desk   |   5 Nov 2018 6:22 AM GMT
మద్యం తాగితే ఓటు వేయనీయవద్దు
X
మద్యం తాగి నడిపితే డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుకుంటారు.. జైలుకు పంపిస్తారు. అదే మద్యం తాగించి ఓట్లేసుకుంటారు. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మద్యం తాగిన వారిని ఓటేయకుండా బూతుల్లో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లు చేయాలని.. అప్పుడే రాజకీయ పార్టీల దిమ్మ దిరుగుతుందని అంటున్నారు. మద్యం తాగని వారు ఉండరని.. ఇలా చేస్తే పార్టీలకు ఒక్క ఓటు కూడా పడదని విశ్లేషిస్తున్నారు.

ఇప్పుడీ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. తమను డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుకున్నట్టే.. మద్యం తాగి ఓటేసే ఓటర్లను బూత్ లో పట్టుకోవాలని నెటిజన్లు హ్యాష్ ట్యాగ్ పెట్టి పెద్ద ఉద్యమమే లేవనెత్తుతున్నారు. డ్రంకెన్ డ్రైవ్ లో మందుబాబులను పట్టుకొని హింసిస్తారా.. అధికారంలోకి వచ్చే వాళ్లను మేము కూడా ఇలాగే ఆడుకుంటామంటున్నారు.

తాజాగా దీనిపై స్పందించిన ఓ వ్యక్తి సుప్రీం కోర్టు గడప కూడా తొక్కారు. మద్యం సేవించి ఓటింగ్ లో పాల్గొనకుండా అడ్డుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లను అనేక ప్రలోభాలకు గురిచేస్తుంటాయని.. అందులో మద్యం ప్రధానమైందని.. కాబట్టి ఈ పిల్ ను స్వీకరించి మద్యం తాగి ఓటేయకుండా నిషేధం విధించాలని కోరారు. ఒకవేళ సుప్రీం కనుక ఈ పిటీషన్ పై నిర్ణయం తీసుకుంటే రాజకీయ పార్టీల గుండెలు గుబేలు కావడం ఖాయం..