Begin typing your search above and press return to search.

పవన్ తిడుతుంటే ఎంపీకి ఆనందంగా ఉందా!!

By:  Tupaki Desk   |   28 Aug 2016 7:20 AM GMT
పవన్ తిడుతుంటే ఎంపీకి ఆనందంగా ఉందా!!
X
తిరుపతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబుపై ఆయన విరుచుకుపడతారని చాలామంది ఊహించారు. కానీ.. అందుకు భిన్నంగా పవన్ చంద్రబాబు విషయంలో సుతిమెత్తని విమర్శలే చేసినా టీడీపీ ఎంపీలను మాత్రం ఆటాడుకున్నాడు. మోడీ ముందు - కేంద్రంలోని ఇతర పెద్దల ముందు సార్ సార్ సార్.. అంటూ యాచకుల్లా దేబిరిస్తున్నారని ఏకిపడేశాడు. ప్రత్యేక హోదా కోసం కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు రాజీనామా చేయలేరా అని ఆయన డైరెక్టుగా ప్రశ్నించారు. ఎంపీలు కూడా చేతకాని వాళ్లలా ఉంటున్నారన్నట్లుగా ఆయన విమర్శలు చేశారు. కేశినేని నాని - అవంతి శ్రీనివాస్ - మురళీ మోహన్ వంటి టీడీపీ ఎంపీల పేర్లు ప్రస్తావించి మరీ కేంద్రాన్ని నిలదీయకుండా సిగ్గులేకుండా బతిమాలుకుంటారా అని ప్రశ్నించాడు.

అయితే.. పవన్ అంతగా విరుచుకుపడినా టీడీపీ ఎంపీలు మాత్రం పవన్ ప్రత్యేక హోదాపై పోరాడుతానని చెప్పడం ఆనందంగా ఉందంటూ నవ్వుకుంటూ స్వాగతం పలుకుతున్నారు. ఎంపీ కేశినేని నాని అయితే.. ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్‌ కల్యాణ్‌ పోరాటాన్ని స్వాగతిస్తున్నామని వెంటనే ప్రకటన చేశారు. పవన్‌ ప్రత్యేక హోదాపై మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. రాజీనామాల వల్ల ప్రత్యేక హోదా వస్తుందంటే రాజీనామా చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. దీంతో పవన్ తనను తిడుతుంటే కేశినేని చాలా ఆనందపడుతున్నారంటూ ఆయన వ్యతిరేకులు అంటున్నారు.

ప్రత్యేక హోదా సాధించేందుకు చంద్రబాబు ఇప్పటికే పలు ప్రయత్నాలు చేశారని.. జనసేన తమ పార్టీకి మిత్రపక్షమని.. ప్రత్యేక హోదాపై పోరాడటానికి పవన్ కల్యాణ్ పిలుపునివ్వటాన్ని తాము స్వాగతిస్తున్నట్లుగా టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ ఎంపీలంతా లోక్ సభను ఎందుకు స్తంభింపచేయరు? కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయరు? అంటూ పవన్ డైరెక్టుగా వారినే ప్రశ్నించినా కూడా వారు దానికి సమాధానం చెప్పకుండా పవన్ పోరాడితే ఆయన వెంట నడుస్తామన్నట్లుగా మాట్లాడడం విచిత్రమే. ఏపీ అధికారంలో ఉన్న పార్టీగా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మిత్రపక్షంగా టీడీపీ నేతలే పోరాటాన్ని ముందుండి నడిపించాల్సింది పోయి.. పవన్ తోక పట్టుకుని వెళ్తామన్నట్లుగామాట్లాడుతుండడం విమర్శకుల నోటికి పని చెబుతోంది.