Begin typing your search above and press return to search.

ఎస్టిమేట్స్ కమిటీలో నాని..బీజేపీ వ్యూహం ఏమిటో?

By:  Tupaki Desk   |   11 July 2019 4:54 PM GMT
ఎస్టిమేట్స్ కమిటీలో నాని..బీజేపీ వ్యూహం ఏమిటో?
X
కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకున్న బీజేపీ... తనకు అనువు గానీ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు తనదైన శైలి వ్యూహాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు... అందులోనూ ఏపీలో ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం నిజంగానే ఆసక్తిని రేకెత్తిస్తోందని చెప్పక తప్పదు. తాజా ఎన్నికలకు ముందు తనతో మైత్రీబంధాన్ని తెంచుకుని ఎన్నికల్లో చిత్తుగా ఓడిన టీడీపీని మరింతగా బలహీనం చేసే క్రమంలో బీజేపీ అనుసరిస్తున్నవ్యూహం అటు టీడీపీతో పాటు ఇటు వైసీపీనే కాకుండా సొంత పార్టీ నేతలకు కూడా షాకింగేనని చెప్పక తప్పదు. అలాంటి వ్యూహాల్లో భాగంగా టీడీపీ సీనియర్ నేత - విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (కేశినేని నాని)ని పార్లమెంటు అంచనాల కమిటీ సభ్యుడిగా ఎంపిక చేసిన బీజేపీ నిజంగానే అందరికీ ఓ గట్టి షాకిచ్చిందనే చెప్పాలి.

ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు చంద్రబాబుకు ఝలక్కిచ్చి కమలం గూటికి చేరిపోయారు. వారిలో సుజనా చౌదరితో పాటు సీఎం రమేశ్ - గరికపాటి మోహన్ రావు - టీజీ వెంకటేశ్ లు ఉన్నారు. వీరిలో ఇప్పటిదాకా ఏ ఒక్కరికి కూడా పెద్దగా పదవులేమీ ఇవ్వని బీజేపీ... ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్న నానికి అంచనాల కమిటీలో చోటు కల్పించడమంటే షాకే కదా. టీడీపీలోనే ఉన్నా... కేశినేనిని బీజేపీలోని చాలా మందితో సన్నిహిత సంబంధాలున్నాయి. తాజా ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే బీజేపీ సీనియర్ నేత - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వారి ఆశీర్వాదాలు అందుకున్న నాని... రాష్ట్ర రాజకీయాల్లో పెను కలకలమే రేపారు. టీడీపీ టికెట్ పై గెలిచినా... నాని మాత్రం బీజేపీలో చేరిపోతారని నాడు వార్తలు వచ్చాయి. అయితే బీజేపీలో చేరేది లేదని ప్రకటించిన నాని.... తాను టీడీపీలోనే ఉంటానని ప్రకటించారు.

అయితే అప్పటి నుంచి ట్విట్టర్ లో తనదైన శైలి ట్వీట్లు పెడుతున్న నాని... టీడీపీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలకు షాకుల మీద షాకులిస్తున్నారు. పార్టీ తరఫున తనతో పాటు విజయం సాధించిన మరో ఇద్దరు ఎంపీలు గల్లా జయదేవ్ - కింజరాపు రామ్మోహన్ నాయుడులకు దక్కినంత ప్రాధాన్యం తనకు దక్కలేదన్న భావన వ్యక్తమయ్యేలా కొన్ని రోజుల పాటు ట్వీట్లు పెట్టిన నాని... ఇప్పుడు వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో నానిని అంచనాల కమిటీలో సభ్యుడిగా నియమిస్తూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం వెనుక ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సైలెంట్ గానే చాప కింద నీరులా విస్తరించే ప్రణాళికను అమలు చేస్తున్న బీజేపీ... తనకు అనుకూలంగా ఇతర పార్టీల్లో ఉంటున్న నాని లాంటి నేతలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటే... భవిష్యత్తులో టీడీపీకే కాకుండా వైసీపీకి కూడా బీజేపీ గట్టి షాకు ఇచ్చే అవకాశాలున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.