Begin typing your search above and press return to search.

ఇదో చిత్రవిచిత్రమైన ప్రేమకథ

By:  Tupaki Desk   |   27 July 2016 10:30 PM GMT
ఇదో చిత్రవిచిత్రమైన ప్రేమకథ
X
కథల్లోనూ.. సినిమాల్లోనూ కనిపించే ఈ తరహా ప్రేమకథ.. రియల్ గా జరగటం అరుదనే చెప్పాలి. అద్యంతం సినిమా కథను తలపించే ఈ రియల్ లవ్ స్టోరీ చదవాల్సిందే. కేరళలో జరిగిన ఈ రియల్ స్టోరీ చదివాక.. నిజమా? అన్న మాట రావటం ఖాయం. ఇద్దరు కూతుళ్లు తమ తల్లికి జరిపించిన ఈ ప్రేమకథలోకి వెళ్లేందుకు.. దాదాపు మూడున్నర దశాబ్దం వెనక్కి వెళ్లాలి.

అది 1984. కేరళలోని కొల్లాం ఒచిరా అనే ప్రాంతానికి చెందిన అనిత అనే అమ్మాయి ఉండేది. ట్యూషన్ సెంటర్లో పని చేసే విక్రమన్ అనే అతన్ని చూసి మనసు పడింది. వారి మధ్య లవ్ ట్రాక్ నడిచింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే.. అనిత తండ్రి ఆమె ప్రేమకు నో అంటే నో అనేశారు. ఆమెకంటే చాలా పెద్దవాడైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి అతను ఆత్మహత్య చేసుకున్నారు.

దీంతో ఇద్దరి పిల్లల్ని పెంచేందుకు అనిత చాలానే కష్టాలు పడ్డారు. రెక్కలు ముక్కలు చేసి వారిని పెంచి పెద్దవాళ్లను చేశారు. ఆడ పిల్లలు ఇద్దరూ పెద్దయ్యాక తమ తల్లిప్రేమ కథ గురించి విన్నారు. తల్లి ఒకనాటి ప్రియుడైన విక్రమన్ కోసం వెతికారు. చివరకు అతను రాజకీయ కార్యకర్తగా పని చేస్తున్న విషయాన్ని తెలుసుకొని.. ఆయన వద్దకు వెళ్లిన ఇద్దరు ఆడపిల్లలు తమ తల్లి గురించి వివరాలు అందించారు. పెళ్లి చేసుకునేందుకు ఒప్పించారు. దీంతో.. 32 ఏళ్ల తర్వాత అరవయ్యో పడిలో ఉన్న విక్రమన్.. యాభయ్యో పడిలో ఉన్న అనిత ఇద్దరూ ఈ మధ్యనే దంపతులయ్యారు. కూతుళ్ల ప్రోత్సాహంతో కిరణ్ – అనిత ప్రేమకథకు అలా శుభంకార్డు పడినట్లైంది.