Begin typing your search above and press return to search.

సీపీఐ బ్యాన‌ర్‌ లో కిమ్‌!... కేర‌ళ‌లో క‌ల‌క‌లం!

By:  Tupaki Desk   |   17 Dec 2017 12:54 PM GMT
సీపీఐ బ్యాన‌ర్‌ లో కిమ్‌!... కేర‌ళ‌లో క‌ల‌క‌లం!
X
ద‌క్షిణ భార‌తంలో చోటుచేసుకున్న ఓ అరుదైన ఘ‌ట‌న లెఫ్ట్ పార్టీలు - కేంద్రంలో అధికార పార్టీ బీజేపీల మ‌ధ్య పెద్ద చిచ్చునే రాజేసింది. వామ‌ప‌క్షాల పాల‌న‌లో ఉన్న కేర‌ళ‌లో చోటుచేసుకున్న స‌ద‌రు ఘ‌ట‌న నిజంగానే అరుదైన‌దిగానే చెప్పుకోవాలి. ఎందుకంటే... అగ్ర‌రాజ్యం అమెరికాను గ‌డ‌గ‌డ‌లాడించ‌డ‌మే కాకుండా... యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాన‌ని ప్రక‌ట‌న‌లు చేస్తూ ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న ఉత్త‌ర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌... కేర‌ళ అధికార పార్టీ సీపీఐ బ్యాన‌ర్‌ లో ప్ర‌త్య‌క్ష‌మైపోయారు. కేర‌ళ‌లోని ఓ ప్రాంతంలో వెల‌సిన బ్యాన‌ర్‌ లో కిమ్ నిలువెత్తు ఫొటో ద‌ర్శ‌న‌మిచ్చింది. కిమ్ ఫొటో ఉన్న ఈ ఫ్లెక్సీ క్ష‌ణాల్లో దేశ‌వ్యాప్తంగా పెద్ద వార్తై కూర్చుంది. అస‌లే లెఫ్ట్ పార్టీ అధికారంలో ఉన్న కేర‌ళ‌లో ఇటీవ‌లి కాలంలో ఆరెస్సెస్ కార్య‌క‌ర్త‌ల వ‌రుస హ‌త్య‌లు చోటుచేసుకుంటున్నాయి. ఈ హ‌త్య‌ల‌కు అధికార సీపీఐ పార్టీనే కార‌ణ‌మంటూ బీజేపీతో పాటుగా హిందూత్వ వాద సంస్థ‌ల‌న్నీ ఆరోపిస్తున్నాయి.

ఇలాంటి కీల‌క త‌రుణంలో సీపీఐ ఫ్లెక్సీలో కిమ్ ఫొటో ద‌ర్శ‌న‌మివ్వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. సాధార‌ణంగా లెఫ్ట్ పార్టీల ఫ్లెక్సీలు - బ్యాన‌ర్ల‌లో ఆ పార్టీ సిద్ధాంత‌క‌ర్త‌లుగా కార్ల్ మార్క్స్‌ - లెనిన్‌ ల ఫొటోలు ద‌ర్శ‌న‌మివ్వ‌డం సర్వ‌సాధార‌ణం. అయితే ఉన్న‌ట్టుండి కిమ్ ఫొటో ఆ పార్టీ ఫ్లెక్సీల‌పైకి ఎలా ఎక్కింద‌న్న వార్త ఇప్పుడు ఆస‌క్తికరంగా మారింది. కేర‌ళ‌లో కొన‌సాగుతున్న‌ అధికార సీపీఐ పాల‌న‌పై ఓ క‌న్నేసి ఉంచిన బీజేపీ... కిమ్ ఫొటో ఉన్న ఫ్లెక్సీపై చాలా వేగంగా స్పందించింది. కిమ్ ఫొటోతో కూడిన స‌ద‌రు ఫ్లెక్సీని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన బీజేపీ అధికార ప్ర‌తినిధి సంబిత్ పాత్రా... సీపీఐ వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. కేర‌ళ‌లో ఆర్‌ ఎస్‌ ఎస్‌ కార్యకర్తల వరుస హత్యలు జరుగుతోంది ఇందుకేనని అన్నారు. దేశంలోని బీజేపీ - ఆర్‌ ఎస్‌ ఎస్‌ కార్యాలయాలపై కిమ్‌ తరహాలో సీపీఐ అణు క్షిపణులను వేయదని ఆశిస్తున్నట్లు ట్విట్టర్‌ లో వ్యంగ్యంగా రాసుకొచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలో సీపీఐ హత్యాకాండను సృష్టిస్తోందని ఆరోపించిన సంబిత్‌.. బీజేపీ - ఆర్‌ ఎస్‌ ఎస్‌ కార్యాలయాలను క్షిపణులను ఉపయోగించి నేలమట్టం చేయడం సీపీఐ తర్వాతి ఎజెండా కాకుండా ఉంటే బావుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయినా ఈ ఘ‌ట‌న ఎలా జ‌రిగింద‌న్న విష‌యానికి వ‌స్తే... సీపీఐ కార్య‌క‌ర్త‌ల పొర‌పాటు వ‌ల్లే ఈ త‌ప్పు జ‌రిగింద‌ట‌. దీనిపై స్పందించిన ఆ పార్టీ జిల్లా కార్య‌ద‌ర్శి ఒక‌రు ఇదే విష‌యాన్ని చెప్పుకొచ్చారు. త‌మ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు చేసిన పొర‌పాటు కార‌ణంగానే త‌మ పార్టీ ఫ్లెక్సీలో కిమ్ ఫొటో వ‌చ్చి చేరింద‌ని - అయితే త‌ప్పును గ్ర‌హించిన వెంట‌నే దానిని తొల‌గించి వేశామ‌ని ఆయ‌న చెప్పారు.