Begin typing your search above and press return to search.

బాకాకు మాత్రమే కవిత పర్మిషన్ ఇస్తారా?

By:  Tupaki Desk   |   28 Aug 2016 9:13 AM GMT
బాకాకు మాత్రమే కవిత పర్మిషన్ ఇస్తారా?
X
మిగిలిన పార్టీల్ని పక్కన పెడితే తెలంగాణ అధికారపక్ష ఎజెండా చాలా క్లియర్ గా ఉంటుంది. విషయం ఏదైనా మైలేజీ మొత్తం తనకే సొంతం కావాలన్న స్పష్టమైన వైఖరి కనిపిస్తుంది. ఎంతమంది ఎంతలా సాయం చేసినా.. చివరకు పేరు ప్రఖ్యాతులు మాత్రం తమకే రావాలనుకుంటారు. మిగిలిన వాళ్లు కాస్త ఆశ పడినా పేరు ప్రఖ్యాతులు షేర్ చేసేందుకు ససేమిరా అనటం కనిపిస్తుంది.

మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కారుకు ఇటీవల చేసుకున్న చారిత్రక ఒప్పందం విషయానికే వస్తే.. ఈ మూడు ఒప్పందాలు తెలంగాణ ప్రభుత్వానికి కీలకమైనవన్న వాదనను కేసీఆర్ అండ్ కో వినిపిస్తున్నారు. పలువురు దీన్ని తప్పు పడుతున్నా.. వారు మాత్రం ఈ ఒప్పందంతో తెలంగాణ చాలా ప్రయోజనం పొందుతుందని చెబుతున్నారు. అదెంత నిజమన్నది కాలమే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. తెలంగాణతో ఒప్పందం చేసుకోవటానికి మహారాష్ట్రలోని బీజేపీ సర్కారు ఓకే చెప్పింది. తెలంగాణ అధికారపక్ష నేతల మాటల ప్రకారమే చూస్తే.. తాజాగా చేసుకున్న మూడు ఒప్పందాలతో తెలంగాణకు భారీ ప్రయోజనమనే మాటే నిజమని అనుకుందాం. మరి.. అది సాకారం కావటానికి మహారాష్ట్ర సర్కారు సానుకూలంగా స్పందించినట్లే కదా. అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చొరవ ప్రదర్శించిన మహారాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పటంలో తప్పు లేదు. అదే పనిని చేసిన తెలంగాణ బేజేపీ నేతలపై ఫైర్ అవుతున్నారు కేసీఆర్ కుమార్తె కమ్ ఎంపీ అయిన కవిత. ఆమె మాటల్లో చూస్తే.. తెలంగాణ కమలనాథులు మహారాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రిని పొగుడుతూ పోస్టర్లు వేయటం విడ్డూరంగా ఉందంటున్నారు. కేసీఆర్ ఎంతో శ్రమించి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోగా.. బీజేపీ నేతలు మహారాష్ట్ర సీఎంకు థ్యాంక్స్ చెబుతూ పోస్టర్లు వేయటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ‘మేం చేసిన పెళ్లికి మీరు భాజాలు కొట్టినట్లుగా ఉంది’ అంటూ విమర్శించిన ఆమె.. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా వచ్చేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా తెలంగాణ సర్కారుతో ఒప్పందాలు చేసుకున్న మహారాష్ట్ర సర్కారుకు థ్యాంక్స్ చెప్పినందుకు కవిత ఇంతలా ఫైర్ అవుతున్న తీరు చూస్తే అనిపించేది ఒక్కటే. తమకు తప్పించి మరెవరికీ పేరు ప్రఖ్యాతులు రాకూదన్న భావన ఆమె మాటల్లో స్పష్టంగా వినిపిస్తోందన్న విమర్శ వినిపిస్తోంది.