Begin typing your search above and press return to search.

పాఠ్యాంశాలు.. విగ్రహాలు ఒక్కటేనా కవితక్క?

By:  Tupaki Desk   |   1 Sep 2015 5:44 AM GMT
పాఠ్యాంశాలు.. విగ్రహాలు ఒక్కటేనా కవితక్క?
X
మోకాలికి బోడిగుండుకు ముడి పెట్టటం.. అందుకు తగ్గ వాదనను వినిపించటం టీఆర్ ఎస్ నేతల్లో చాలామంది చేసేదే. నిన్నటికి నిన్న.. ఆంధ్రోళ్ల సమస్యల పరిష్కారం కోసం.. వారి హక్కుల కోసం పోరాడతామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె.. ఎంపీ కవిత.. ఒక్కరోజుకే తన మాటల్ని పూర్తిగా మార్చేశారు. ఒకరోజు ఆంధ్రోళ్ల మీద అమితమైన అనురాగాన్ని కురిపించిన ఆమె.. ఒక్కరోజు గడిచేసరికి అంతులేని ఆవేశాన్ని ప్రదర్శించారు.

కవిత మాటలు వింటే.. ఆమె ఆగ్రహం.. ఆంధ్రా పాలకుల మీదా? ఆంధ్రా ప్రజల మీదా? అన్న సందేహం తలెత్తకమానదు. లోతుగా చూస్తే.. ఆంధ్రా సర్కారు మీద కోపాన్ని ఆంధ్రా ప్రజల మీద ప్రదర్శించటం స్పష్టంగా కనిపిస్తుంది.

ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి సంబంధించి.. హైదరాబాద్ లో ఉన్న విగ్రహాల్ని ఆంధ్రాకి పంపేయాలన్న అతివాద వ్యాఖ్యల్ని ఆమె నేరుగా మాట్లాడరు కానీ.. అలాంటి మాటలు చెప్పే వారికి మాత్రం తన మద్ధతు ఉంటుందని చాలా తెలివిగా చెప్పుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన చరిత్రను.. ఏపీ పాఠ్యాంశాల నుంచి తొలగించటాన్ని ఆమె ప్రశ్నిస్తున్నారు. విడిపోయి కలిసి ఉండాలన్నది తమ సిద్ధాంతానికి భిన్నంగా ఏపీ పాఠ్య పుస్తకాల్లో మార్పు చేశారని చెప్పుకొచ్చారు.

ఈ మాట చెబుతున్న ఆమె.. పాఠ్యాంశాల్లో మార్పు.. ఏపీ అన్న మాట లేకుండా చేసింది మొదట తెలంగాణ ప్రభుత్వమేనన్న విషయాన్ని మాట మాత్రం ప్రస్తావించని ఆమె.. ఏపీ సర్కారు పాఠ్యాంశాల్లో తెలంగాణ వారికి సంబంధించినవి తొలగించటం పెద్ద తప్పుగా చూపిస్తున్నారు. తెలంగాణకు ఏపీకి సంబంధించిన అంశాలు అనవసరం అయినప్పుడు.. ఏపీకి మాత్రం తెలంగాణకి సంబంధించిన అంశాలు పాఠ్యాంశాలుగా కోరుకోవటం అత్యాశే అవుతుంది.

ఇదిలా ఉంటే.. ఎవరి ప్రాంతానికి చెందిన పాఠ్యాంశాల్ని వారు తయారు చేసుకోవటం మామూలైన వేళ.. కవితమ్మ నోట మాత్రం విచిత్రమైన వాదన వినిపించింది. పాఠాలుగా తెలంగాణవారు అవసరం లేనప్పుడు.. తెలంగాణలో ఏపీకి చెందిన వారి విగ్రహాలు ఎందుకన్న విచిత్రమైన వాదనను వినిపిస్తున్నారు. పాఠ్యాంశాలకు.. విగ్రహాలకు పోలిక పెట్టటమే అసలు సమస్య.

దేశాన్ని చీల్చిన జిన్నా లాంటి వ్యక్తి పేరును ఇప్పటికి వీధి పేరుగా తొలగించుకోకుండా.. ఇంకా కొనసాగిస్తున్న పరిస్థితి. అలాంటి ఒక ప్రాంతానికి చెందిన వారి విగ్రహాల్ని ఏర్పాటు చేస్తే.. వాటిని కూలదోసి.. లారీల్లో మీ రాష్ట్రానికి పంపించేస్తామని చెబుతున్న వారు.. ఏపీ పాలకుల హయాంలో ఏవైనా నిర్మాణాలు జరిగాయో.. అద్భుతమైన కట్టడాలు కట్టారో.. వాటిని కూడా తరలించేస్తారా?

కట్టడాలు.. మహనీయుల విగ్రహాలు ఇలాంటివి చరిత్రకు సంబంధించినవి. అలాంటి వాటిని తొలగించటం.. పాఠ్యాంశాల్లోని పాఠాల్ని మార్చటంతో ముడిపెట్టటం సహేతుకం కాదన్న వాదన వినిపిస్తోంది. ఒకవేళ.. అది కూడా తప్పే అనుకుంటే.. ఆ పని ఏపీ కంటే తెలంగాణ ప్రభుత్వమే ఎందుకు చేసిందన్న ప్రశ్నకు కవితక్క సమాధానం చెబితే బాగుంటుంది. తాము చేసేది ఏదైనా సరే.. అది కరెక్ట్ అన్నట్లు మాట్లాడే కవితమ్మ లాంటి వారు.. అవతలి వారు కూడా మనుషులేనని.. వారిలోనూ రక్తమాంసాలు ఉంటాయని.. తాము ఏ బాటలో పోతున్నామో.. అదే విధంగా వారు వెళతారన్న విషయాన్ని మర్చిపోతే ఎలా? విధ్వంసకం ఆలోచనలు చేసే కన్నా.. రెండు ప్రాంతాల మధ్య నెలకొన్న దూరాన్ని వీలైనంత వరకూ తగ్గించే అంశంపై మీద ఫోకస్ చేస్తే బాగుంటుందేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.