Begin typing your search above and press return to search.

మ‌హాకూట‌మి దుష్ట‌చ‌తుష్ట‌యం

By:  Tupaki Desk   |   19 Sep 2018 1:54 PM GMT
మ‌హాకూట‌మి దుష్ట‌చ‌తుష్ట‌యం
X
ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో అధికార టీఆర్ ఎస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఓ వైపు కొంద‌రు అభ్య‌ర్థుల విష‌యంలో అస‌మ్మ‌తి స్వ‌రం వినిపిస్తుంటే...మ‌రోవైపు అధిష్టానం మాత్రం త‌మ‌దైన శైలిలో ప్ర‌చారంలో బిజీబిజీగా ముందుకు పోతోంది. తాజాగా త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నిజామాబాద్ పార్ల‌మెంటు ప‌రిధిలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌య‌ - ఎంపీ కవిత ప్ర‌చారం నిర్వ‌హించారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నార‌ని, ప్రచారానికి ప్రజలనుంచి అద్భుత స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. ఈ ఆద‌ర‌ణ చూడ‌లేక‌నే ప్ర‌తిప‌క్షాలు ఉద్దేశ‌పూర్వ‌క విమ‌ర్శ‌లు చేస్తున్నాయ‌ని అన్నారు. ఓట్ల గల్లంతు విషయంలో కాంగ్రెస్ కావాలనే టీఆర్ ఎస్‌ పై దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల వ్యవహారం ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తుందన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గమనించాలని ఆమె సూచించారు.

టీఆర్ ఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా మ‌హాకూట‌మి ఏర్పాటుకు అన్ని పార్టీలు ఏక‌మ‌వడాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని ఎంపీ క‌విత కోరారు. తెలంగాణ మీద ప్రేమ లేని పార్టీలు మహాకూటమిగా వస్తున్నాయన్నారు. మహాకూటమి దుష్ట చతుష్టయం అని కవిత పేర్కొన్నారు. ఆయా పార్టీల నేత‌లు అభివృద్ధి నిరోధ‌కుల‌ని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను ఇప్పటికే టీడీపీ - కాంగ్రెస్ పార్టీలు పీక్కుతిన్నాయని కవిత నిప్పులు చెరిగారు. 60 ఏళ్లుగా లేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ నాలుగేళ్లలో చేసి చూపించారని, అయినా ఆయా పార్టీలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయ‌న్నారు. పెండింగ్‌ లో ఉన్న రైల్వే పనులు - అండర్ గ్రౌండ్ పనులు పూర్తయ్యాయని - అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ క‌విత పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటేసి.. మరోసారి టీఆర్ ఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. టీఆర్ ఎస్ పార్టీ నేత‌లు సంక్షేమ - అభివృద్ధి పథకాలపై గడప గడపకూ ప్రచారం చేస్తూ - రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో అభ్య‌ర్థుల‌ను గెలిపించి సీఎం కేసీఆర్‌ కు బహుమతిగా అందించాలని కోరారు.