కత్తి కేసు వాపసు ఎందుకు తీసుకున్నట్లు..?

Sat Jan 20 2018 10:20:56 GMT+0530 (IST)

మాటలతో మంటలు పుట్టించిన కత్తి మహేశ్ ఎట్టకేలకు మెత్తబడ్డారు. తనపై కోడిగుడ్లతో దాడి చేసిన యువకులపై చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. అంతేకాడు. గడిచిన కొంతకాలంగా తాను చేస్తున్న విమర్శలు.. ప్రతి విమర్శలు పక్కన పెట్టి పవన్ అభిమానులతో కలిసి స్వీట్లు తిని.. సెల్ఫీ దిగారు.  దీంతో.. ఈ వ్యవహారం సమిసిపోయినట్లుగా చెబుతున్నారు. అసలేం జరిగిందంటే..జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఆయన గడిచిన కొద్దికాలంగా చేస్తున్న విమర్శలు.. దానికి ప్రతిగా పవన్ అభిమానులు తీవ్రంగా రియాక్ట్ కావటం తెలిసిందే. మొత్తంగా వరుస పరిణామాలతో రియల్ సీరియల్ అంతకంతకూ ముదురుతూ.. మొన్న రాత్రి కత్తిపై కోడిగుడ్ల దాడి వరకు వెళ్లింది.

ఒక ఛానల్ లో జరిగే చర్చకు వెళుతున్న కత్తి మహేశ్ పై గుర్తు తెలియని యువకులు ఇద్దరు కోడిగుడ్లతో దాడి చేశారు. దీనిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కత్తి మహేశ్ ఫిర్యాదు చేశారు.  అనంతరం టీవీ ఛానల్ చర్చలో పాల్గొన్న ఆయన.. పవన్ తనకు క్షమాపణలు చెప్పాలన్నారు. దీనికి వాదప్రతివాదాలు జరుగుతున్న వేళ.. పవన్ నుంచి.. జనసేన పార్టీ తరఫున రెండు ప్రెస్ నోట్లు రిలీజ్ అయ్యాయి. ఎవరో ఏదో విమర్శలు చేసినంత మాత్రాన వాటికి అనవసరంగా ఆవేశానికి గురి కావొద్దని.. స్పందించొవద్దన్నారు. ఈ నేపథ్యంలో తాను కోరినట్లే.. పవన్ స్పందించిన వైనంపై కత్తి సంతృప్తి వ్యక్తం చేసినా.. క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్‌ను కత్తి మరోసారి తెర మీదకు తెచ్చారు.

గంటల కొద్దీ వివాదం అదే పనిగా సాగుతున్న వేళ.. పవన్ అభిమానులు కొందరు రంగంలోకి దిగారు. కత్తితో చర్చలు జరిపారు.  అదే సమయంలో పవన్ నుంచి లేఖ విడుదల కావటంతో వెనక్కి తగ్గారు. అదే సమయంలో కత్తిపై దాడి చేసిన అనుమానితులైన ఇద్దరు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పవన్ అభిమానులు జరిపిన చర్చల నేపథ్యంలో మెత్తబడ్డ కత్తి మహేశ్.. తాను ఫిర్యాదు చేసిన మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆవేశంలో.. అమితమైన అభిమానంతో తనపై కోడిగుడ్లు విసిరిన యువకుల మీద తాను చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. అయితే.. పవన్ తనకు క్షమాపణలు చెప్పే డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గటం లేదని ప్రకటించారు.

మరోవైపు.. కత్తి మహేశ్.. పవన్ అభిమానులు కలిసి వివాదాలకు పుల్ స్టాప్ పెట్టాలని.. విమర్శలు చేసుకోవటం పక్కన పెట్టాలన్న మాటలు జరిగాయి. అయితే.. పవన్ సినిమా.. రాజకీయాలకు సంబంధించిన విమర్శలు చేస్తానని.. వ్యక్తిగత విమర్శలు మాత్రం తాను చేయనని కత్తి ప్రకటించారు. తనపై కోడిగుడ్లతో దాడి చేసిన వారు పశ్చాత్తాపం వ్యక్తం చేయటం వల్లే తాను చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు. మొత్తానికి పవన్ అభిమానులు వర్సెస్ కత్తి మహేశ్ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం తాజా పరిణామాలతో సమిసిపోయినట్లు చెబుతున్నారు. మరి.. కత్తి  ఎలా రియాక్ట్ అవుతారో? ఏం ట్వీట్లు చేస్తారన్న దానిపై భవిష్యత్ పరిణామాలు ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే వేలాది గంటల పాటు సాగిన మాటల యుద్ధం ఇకనైనా ముగిసిపోతే.. లేనిపోని ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని చెప్పక తప్పదు.