టీడీపీ నేత యామినికి కత్తి మహేశ్ మద్దతు

Wed Jun 12 2019 23:00:01 GMT+0530 (IST)

కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీలోనే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ. సాఫ్ట్ వేర్ రంగం నుంచి రాజకీయాల వైపు వచ్చిన ఆమె.. రెండు సంవత్సరాల క్రితం టీడీపీలో చేరారు. సోషల్ మీడియాలో ఆమె వీడియోలు - పరిజ్ఞానం - భాషపై పట్టు చూసిన చంద్రబాబు.. యామినిని టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు. దీంతో ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్ - అప్పటి ఏపీ ప్రతిపక్ష నాయకులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఈ రెండు పార్టీలకు చెందిన అభిమానులు యామినిపై సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాల విమర్శలు చేస్తున్నారు. పురుషులే కాదు.. మహిళలు కూడా సోషల్ మీడియాలోకి వచ్చి ఆమెపై బూతు పంచాంగం వదులుతున్నారు. దీంతో యామిని రెండు రోజుల క్రితం డీజీపీ కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు ఓపెన్ చేస్తున్నారని - వాటిలో అసభ్యకరమైన - అభ్యంతరకరమైన పోస్టింగులు - వీడియాలు - ఫొటోలు షేర్ చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ స్పందించారు.

 ‘‘తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ సాధినేని యామిని ఫేక్ పేజ్ - ట్రోలియంగ్అసభ్యకరమైన కాల్స్ ను ఖండిస్తున్నాను. ఎన్నికల సందర్భంలో వంద అన్నా అనుకున్నా - ఇలాంటి కక్ష సాధింపు చర్యలు - వ్యక్తిత్వహననాలు అభిలషణీయం కాదు’’ అని కత్తి మహేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుగా ఉన్న కత్తి మహేశ్.. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామినిపై జరుగుతున్న సైబర్ దాడిని ఖండించడం స్వాగతించాల్సిన అంశం అంటూ పలువురు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పార్టీలకతీతంగా మహిళపై జరుగుతున్న దాడిపై ఆయన స్పందించడం గొప్ప పరిణామమే మరి.

 గత మంగళవారం సాధినేని యామిని డీజీపీ కార్యాలయానికి వెళ్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ‘‘సోషల్ మీడియాలో పోస్టింగులు మాత్రమే కాదు.. తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ తెలుసుకుని చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. అర్ధరాత్రి - అపరాత్రి అని చూడకుండా పదే పదే కాల్ చేసి వేధిస్తున్నారు. ఫోన్ రింగ్ అయితేనే నేను - నా కుటుంబ సభ్యులు భయపడాల్సి వస్తోంది. నన్ను వేధిస్తూ నా మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్న.. నా కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులను చట్టపరంగా శిక్షించండి’’ అంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి విధితమే.