కత్తి మెత్తనోడే..తండ్రి - గ్రామస్థుల మాటిది

Sun Jan 21 2018 13:49:27 GMT+0530 (IST)

కత్తి మహేశ్... పవన్ కల్యాణ్‌పై వరుస ఆరోపణలతో వార్తల్లోకెక్కిన ఫిలిం క్రిటిక్. టీవీల చర్చావేదికల్లో కనిపిస్తూ ట్విటర్లో పోస్టులు చేస్తూ పవన్ అభిమానుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్న ఆయన ఇటీవల పవన్ అనుకూల వర్గాల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకున్న సంగతి తెలిసిందే. అందులో ప్రధానంగా ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణల విషయంలో ఆయన వెనక్కు తగ్గడం చర్చనీయమైంది. దాంతో అంత పెద్ద నోరున్న కత్తి మహేశ్ ఎందుకు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే... మీడియాకు చెందిన కొందరు కత్తి సొంతూరికి వెళ్లగా అక్కడ ఆయన తండ్రి - గ్రామస్థులు మాట్లాడిన అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ... కత్తి తండ్రి ఈ రగడపై ఏమంటున్నారో చూద్దాం.
    
వ్యవసాయ శాఖలో పనిచేసి రిటైరైన కత్తి తండ్రి తాను ఉద్యోగంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని.. అలాగే కత్తి తల్లి చీటీల వ్యాపారం చేసి మోసగించారన్నవి కొందరు చేస్తున్న ఆరోపణలు. దీనిని కత్తి తండ్రి ఖండించారు. తన భార్య కేవలం ఇంట్లో వంటవార్పూ చేస్తూ గృహిణి బాధ్యతల్లో ఉండేవారే కానీ చీటీల వ్యాపారం చేయలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాగే తాను కూడా చిత్తూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పనిచేశాను కానీ ఎక్కడా అవినీతి మచ్చన్నది పడలేదని చెప్పుకొచ్చారు.
    
ఇక కత్తి బంధువులు గ్రామస్థులు మాటల్లోనూ అదే వినిపించింది. కత్తి తల్లిదండ్రులు తమ అవసరాల కోసం అక్కడా ఇక్కడా చిట్టీలు వేసి మోసపోయిన సందర్భాలున్నాయి కానీ వారు స్వయంగా చిట్టీల నిర్వహించలేదని తెలిపారు. కత్తి గ్రామంలో అందరితో మంచిగా ఉండేవారని.. ఇటీవల సంక్రాంతికి వచ్చి కూడా అందరితో సరదాగా గడిపారని తెలిపారు. ఆయనకు పవన్ అభిమానులు బెదిరింపు కాల్స్ చేస్తుండడంతోనే ఆయన స్పందించాల్సి వస్తోందని కత్తి తండ్రి గ్రామస్తులు చెప్పుకొచ్చారు.