కత్తి విశ్లేషణ!... పవన్ ప్యారనోయా రోగి?

Sun Apr 22 2018 14:23:02 GMT+0530 (IST)


టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కు సంబంధించిన చర్చలో జనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ప్రయేమం లేకుండానే అంతర్భాగమైపోయారనే చెప్పాలి. టాలీవుడ్ లో అగ్రహీరోగా ఏ ఒక్క హీరోకు లేనంత మంది అభిమానులున్న నటుడిగా పవన్ ఈ విషయంపై తనదైన శైలిలో స్పందిండచమే పాపమన్నట్లుగా పరిస్థితి తయారైపోయిందని కూడా చెప్పక తప్పదేమో. అన్యాయం జరిగితే... టీవీ ఛానెళ్లకు ముందుకు రావడం కాకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలన్న పవన్ సూచనపై కాస్టింగ్ కౌచ్పై పెద్ద చర్చ జరిగేలా చేసిన నటి శ్రీరెడ్డి విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పోలీస్ స్టేషన్ కు వెళితే... తమ ఫిర్యాదును పోలీసులు తీసుకునే పరిస్థితి ఉందా? అంటూ ప్రశ్నించిన ఆమె... అలాంటి పరిస్థితి లేని కారణంగానే తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా పవన్ కల్యాణ్ సింగిల్ మాటతోనే ఈ వివాదంలోకి బలవంతంగానే తీసుకురాబడిన వ్యక్తిగా జనం చెప్పుకుంటున్నారు.ఈ క్రమంలో తన తల్లిపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం వాటిపై తీవ్ర ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్... ఏకంగా తానే రంగంలోకి దిగుతున్నట్లుగా వ్యవహరించిన నేపథ్యంలో కాస్టింగ్ కౌచ్ ఎక్కడికి పోయిందో గానీ...  ఇప్పుడు పవన్ వ్యవహార సరళిపైనే చర్చ నడుస్తోంది. తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారితో పాటు సదరు వ్యాఖ్యలను పదేపదే ప్రసారం చేసిన మీడియాపై నేరుగానే రంగంలోకి దిగిన పవన్... తన ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. తనను టార్గెట్ చేస్తూ... తన తల్లిని అవమానించిన వారిపై న్యాయ పోరాటం చేస్తానంటూ పవన్ ప్రకటించగా అది ఇప్పుడు విధ్వంసాలకు న్యాయ పోరాటాలకు దారి తీసింది. మొత్తంగా ఇప్పుడు ఓ కొత్త తరహా ఫైట్ జరుగుతోందనే చెప్పాలి. ఇక ఈ విషయంపై ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన లైవ్ డీబేట్ లో పాలుపంచుకున్న సందర్భంగా ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేశ్... పవన్ పాలిటిక్స్ పై తనదైన శైలి విశ్లేషణ చేశారు. అంతేకాకుండా ట్విట్టర్ వేదికగా పవన్ శైలిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ఇప్పుడు నిజంగానే వైరల్గా మారడమే కాకుండా... పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్పై పెద్ద చర్చకే తెర లేసిందని చెప్పాలి. అసలు తన ట్వీట్ లో పవన్ను కత్తి మహేశ్ ఏమన్నారన్న విషయానికి వస్తే... *పవన్ కల్యాణ్ కాస్తా పనిలేని కల్యాణ్ గా మారి తన ఊహాజనిత మీడియా శత్రువుల మీద పిచ్చి ట్వీట్లు పెట్టుకుంటూ ఆత్మన్యూనత ఐడెంటిటీ క్రైసిస్ మధ్య సంక్రమించినొక ప్యారనోయా రోగి లాగా తయారై రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాడు. ఎవరైనా కాపాడండి* అంటూ కత్తి మహేశ్ తనదైన శైలి వ్యాఖ్యలు సంధించాడు. మొత్తంగా ఈ వివాదాన్ని ఆసరా చేసుకుని బయటకు వచ్చిన పవన్ కల్యాణ్... తన రాజకీయ భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారని కూడా మహేశ్ అభిప్రాయపడ్డాడు. మరి దీనిపై అటు పవన్ కల్యాణ్ గానీ ఆయన అభిమానులు గానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.