కరుణకు స్వర్గం పక్కానట..అదెలానంటే..!

Fri Aug 10 2018 11:06:55 GMT+0530 (IST)

ద్రవిడ దిగ్గజం కలైంజర్ కరుణ మరణం.. తమిళనాడు వ్యాప్తంగా ఎంతటి శోకంలో ముంచిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే.. కరుణ మరణంపై పండితులు చెబుతున్న మాటలు ఆయన అభిమానులకు సాంత్వన కలిగిస్తున్నాయి. ఏకాదశినాడు మృతి చెందిన వ్యక్తులకు ద్వాదశినాడు అంత్యక్రియలు నిర్వహిస్తే మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయని చెబుతున్నారు.నాస్తికుడైన కరుణ ఏకాదశి సాయంత్రం మరణించటం.. ద్వాదశి (బుధవారం) రోజున ఖననం చేయటంతో ఆయనకు స్వర్గప్రాప్తి పక్కానని చెబుతున్నారు. దేవుడు ఉన్నాడన్న నమ్మకాలు లేని కరుణ స్వర్గం ఖాయమని పండితులు చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మరాఇంది.

అంతేనా.. కరుణకు లభించిన భాగ్యం అందరికి లభించదని.. చాలా తక్కువ మందికి.. ఆ మాటకు వస్తే అరుదుగానే ఈ అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. ఇతరుల కోసం పాటుపడే పరోపకారులకు మాత్రమే ఈ భాగ్యం లభిస్తుందని చెప్పటం గమనార్హం.

కరుడుగట్టిన నాస్తికవాదిగా ఉన్న కరుణకు స్వర్గలోక ప్రాప్తి లభించే అరుదైన అదృష్టానికి నోచుకున్నట్లుగా చెబుతున్న మాటలు ఒక పక్క.. కరుణకు స్వర్గలోక ప్రాప్తి కోసం చిదంబరంలోని నటరాజస్వామి ఆలయంలో ఆయనకు మోక్ష ప్రాప్తి కలగాలని రాజగోపురంపై బుధవారం సాయంత్రం మోక్ష దీపాలు వెలిగించారు.

కరుణ మరణ వార్త విని ఆవేదనతో మరణించిన వారి సంఖ్య 43 మందికి చేరుకుంది. అదే సమయంలో కరుణపై దాఖలైన 13 పరువునష్టం కేసుల్ని కొట్టివేస్తూ చెన్నై ప్రిన్సిపల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా మరణం తర్వాత కరుణకు క్లీన్ చిట్ ఇచ్చినట్లైంది.