Begin typing your search above and press return to search.

అమ్మకేమైందో చెప్పరే అంటూ క్వశ్చన్ చేస్తున్న కరుణ

By:  Tupaki Desk   |   30 Sep 2016 1:33 PM GMT
అమ్మకేమైందో చెప్పరే అంటూ క్వశ్చన్ చేస్తున్న కరుణ
X
ఒక ముఖ్యమంత్రి అనారోగ్యానికి గురైతే ఎలాంటి వైద్య సౌకర్యాలు అందుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. ఆ ముఖ్యమంత్రికి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలేమీ లేవని.. కేవలం హై ఫీవర్.. డీహైడ్రేషన్ అయితే.. ఎన్ని రోజులు చికిత్స చేస్తారు? మహా అయితే.. ఒకట్రెండు రోజులు. కానీ.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మాత్రం ఈ నెల 22 (ఇవాళ 30) నుంచి చెన్నైలోని అపోలో వైద్యులు వైద్యం చేస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు అమ్మ ఆరోగ్యం కుదుటపడిందని.. ఆమె కోలుకుంటున్నారని చెబుతూ.. పార్టీకి.. ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాల మీద అమ్మ నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ప్రకటనల మీద ప్రకటనలు బయటకు వస్తున్నాయి.

నిజంగానే అమ్మ ఆరోగ్యం భేషుగ్గా ఉంటే అంతకు మించి కావాల్సిందేముంది? బయటకు వచ్చే ప్రకటనలతో పాటు.. అమ్మ ఫోటోలు కూడా వస్తే ఏ గొడవా ఉండేది కాదు. కానీ.. అవేమీ బయటకు రాకుండా.. రోజుల తరబడి ఆసుపత్రిలోనే ముఖ్యమంత్రిని ఉంచేయటంపై పలువురు పలు సందేహాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఇప్పుడున్న సాంకేతికత పుణ్యమా మాంచి జోరు మీదున్న సోషల్ మీడియాతో రకరకాల ఊహాగానాలు బయటకు రావటం.. అమ్మను అభిమానించే వారంతా తీవ్ర ఆందోళనలకు గురయ్యే పరిస్థితి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై తమిళనాడు పోలీసులు సీరియస్ అవుతున్నారు. తప్పుడు ప్రచారం చేస్తే.. వారిపై చర్యలు తీసుకుంటామని.. కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. ఇంత గోల ఎందుకు.. అమ్మ ఆరోగ్యంగా తన పని తాను చేసుకుంటున్న రెండు ఫోటోలు విడుదల చేస్తే ఏ గొడవా ఉండేది కాదు.

ఇదిలా ఉంటే.. తాజాగా డీఎంకే అధినేత.. తమిళనాడు విపక్ష నేత కరుణానిధి నోరు విప్పారు. ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య విషయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? అని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ జయలలిత సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ అభిమతంగా ఆయన వ్యాఖ్యానించారు.

బయట ప్రచారంలో ఉన్న పుకార్లకు పుల్ స్టాప్ పడాలంటే జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు న్యూస్ బులిటెన్ లో విడుదల చేయటంతో పాటు.. ఆమెకు సంబంధించిన ఫోటోల్ని విడుదల చేస్తే సరిపోతుంది. కానీ.. ఇదేమీ లేకుండా గుట్టుగా వ్యవహరించటంపై పలు సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి ఆసుపత్రిలో ఉంటే.. ఆమెకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఆ రాష్ట్ర ప్రజలకు ఉందన్న కరుణానిధి మాటలు విన్నప్పుడు ఆయన మాటలు సమంజసంగా అనిపిస్తాయి.