పళనికి కరుణ పంచ్ మామూలుగా పడలేదట!

Thu Aug 09 2018 16:58:06 GMT+0530 (IST)

తలైవా కరుణ అంత్యక్రియల వ్యవహారం ఇప్పుడు అన్నాడీఎంకేలో కొత్త తిప్పలు తెచ్చి పెట్టింది. కరుణ అంత్యక్రియలు మెరీనా బీచ్ దగ్గర చేయకుండా ఉండేలా చేయాలన్న పళని సర్కారు తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల బూచీ చూపించి.. కోర్టులో ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్ వాదనలు ఇప్పుడు పళని ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చి పెబుతున్నాయి.పెద్ద మనిషి భౌతికకాయాన్ని ముంగిట్లో  పెట్టుకొని.. అంత్యక్రియలు ఎక్కడ చేయాలన్న దానిపై చేసిన వాదనలపై తమిళులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ లబ్థి కోసం సీఎం పళనిస్వామి తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టటమే కాదు.. అంతర్గత కుమ్ములాటల్ని మరింత పెంచేలా చేసిందని చెబుతున్నారు.

ఒకప్పటి చిన్నమ్మ విధేయుడైన పళనిస్వామి.. తర్వాతి కాలంలో కదిపిన వ్యూహం సంగతి తెలిసిందే. పళని తీరుపై ఆగ్రహంగా ఉన్న అన్నాడీఎంకే నేతలు పలువురు ఆ పార్టీ బహిష్కృత నేత దినకరన్ వైపు చూస్తున్న వేళ.. వారికి చెక్ పెట్టేలా కరుణ అంత్యక్రియలపై అభ్యంతరం వ్యక్తం చేయటం ద్వారా రాజకీయ లబ్థిని పొందాలన్న ప్రయత్నం చేశారు.

అయితే.. ఈ తీరును తమిళనాడులోని అన్ని పార్టీలు వ్యతిరేకించటంతో పళనిస్వామి ఏకాకిగా మిగిలారు. డీఎంకే అభిమానులు మాత్రమే కాదు.. సినీ.. రాజకీయ ప్రముఖులు కరుణ అంత్యక్రియలపై పళని సర్కారు తీరును తీవ్రంగా తప్పు పట్టటంతో ఇప్పుడు ఆత్మరక్షణలో పడిన పరిస్థితి.

ఈ విషయంలో.. దినకరన్ తెలివిగా వ్యవహరించి.. కోర్టులో ఉన్న అంశంపై తాను మాట్లాడలేనని తప్పించుకోవటంతో పళని పూర్తిగా బుక్ అయ్యారని చెబుతున్నారు. అన్నాడీఎంకే సర్కారు లాయర్ వాదనలపై మద్రాస్ హైకోర్టు చిరాకు పడుతూ.. కరుణ అంత్యక్రియలు మరో వారం పాటు వాయిదా వేద్దామన్న వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. కోర్టు ఆగ్రహాన్ని గుర్తించిన న్యాయవాది వెనక్కి తగ్గటం.. కరుణ అంత్యక్రియల్ని మెరీనా బీచ్ లో నిర్వహించేందుకు ఓకే చెప్పటం తెలిసిందే.

ఈ ప్రయత్నంలో పళనిస్వామి అనవసరమైన పట్టుదలకు పోయారని.. చాలా తెలివితక్కువగా వ్యవహరించినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. కోర్టులో తమకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తుందన్న విషయాన్ని గుర్తించిన పళని సర్కార్.. తమ పిటీషన్ ను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసి.. కరుణ అంత్యక్రియలకు ఓకే చెప్పింది.కానీ.. ఈ విషయం కంటే కూడా.. కోర్టు అనుమతే ప్రజల్లోకి వెళ్లి.. పళని సర్కారు ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసింది. అందుకే అంటారు.. పట్టుదల ఉండాలి కానీ.. చుట్టు ఉన్న పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకోవాలన్నది అస్సలు మర్చిపోకూడదు. కోట్లాది మంది తలైవా.. తలైవా అంటూ శోకసంద్రంలో మునిగిపోయిన వేళ.. పెద్ద మనసుతో తీసుకోవాల్సిన నిర్ణయాన్ని.. మూర్ఖత్వంతో వ్యవహరించి పళనిస్వామి పెద్ద తప్పునే చేసినట్లుగా చెప్పక తప్పదు.