చిదంబరం గారి అబ్బాయి లండన్ జర్నీ

Fri May 19 2017 14:50:40 GMT+0530 (IST)

మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ఇంట సీబీఐ సోదాలు నిర్వహించటం సంచలనం సృష్టించటం తెలిసిందే. యూపీఏ 1.. యూపీఏ2లలో కీలకభూమిక పోషించిన చిదంబరం లాంటి పెద్ద మనిషి మీద అవినీతి ఆరోపణలు రావటం ఒక ఎత్తు అయితే.. ఏకంగా ఆయన ఇంటి మీదా.. ఆయన కుమారుడి ఇంటి మీదా సీబీఐ సోదాలు నిర్వహించటం.. అది కూడా రెండు రోజుల పాటు సాగటం చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా చిదంబరం గారి అబ్బాయి కార్తీ చిదంబరం లండన్ ట్రిప్ వెళ్లటం హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఇదేమీ ఇప్పటికిప్పుడు అనుకున్న జర్నీ కాదని.. ముందుగా షెడ్యూల్ చేసుకున్నదన్న విషయాన్ని చెబుతున్నారు. లండన్ కు వెళ్లిన తన కొడుకు త్వరలోనే తిరిగి వచ్చేస్తాడని చిదంబరం స్పష్టం చేస్తున్నారు.

కార్తీపై ట్రావెలింగ్ బ్యాన్ లేదన్న విషయాన్ని ప్రస్తావించిన చిదంబరం.. కొద్ది రోజుల్లోనే కార్తీ తిరిగి రానున్న విషయాన్ని ఓ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ వెల్లడించారు. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఇంద్రాణి.. పీటర్ ముఖర్జీలకు సంబంధించిన మీడియా కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో లంచంగా తీసుకొని.. వారి కంపెనీలకు అనుమతులు ఇప్పించినట్లుగా కార్తీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఇదే ఉదంతం మీద చిదంబరం మీద కూడా తాజాగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏమైనా.. మన్మోహన్ సింగ్ సర్కారులో కీలకభూమిక పోషించిన చిదంబరం.. ఈ రోజు అవినీతి ఆరోపణల్లో చిక్కుకుపోవటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/