Begin typing your search above and press return to search.

విశ్వాస పరీక్ష...‘ఆపరేషన్‌ కమల’ భ‌యం!

By:  Tupaki Desk   |   24 May 2018 5:40 PM GMT
విశ్వాస పరీక్ష...‘ఆపరేషన్‌ కమల’ భ‌యం!
X
క‌న్న‌డ రాజ‌కీయాలలు నేడు ఓ కొలిక్కి రానున్నయ‌నే అంచ‌నాల విష‌యంలో మ‌రో ట్విస్ట్ చోటుచేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన హెచ్‌డీ కుమారస్వామి శుక్రవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. అయితే విశ్వాస పరీక్ష కంటే ముందే స్పీకర్‌ ఎన్నిక రూపంలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి తొలి సవాల్‌ ఎదురుకానుంది. అసెంబ్లీ స్పీకర్‌ అభ్యర్థిగా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్‌ సురేశ్‌కుమార్‌ను బీజేపీ బరిలో నిలిపింది. తద్వారా కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి ముందే బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితిని కాషాయ పార్టీ సృష్టించింది. అధికార కూటమి తరఫున కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేయగా.. బీజేపీ తరఫున సురేశ్‌కుమార్‌ తన నామినేషన్‌ను అసెంబ్లీ సెక్రటరీకి అందజేశారు.

ఇదిలాఉండ‌గా... కాంగ్రెస్‌-జేడీఎస్‌ను బీజేపీ ఎత్తుగ‌డ‌ల‌ను ఆలోచ‌న‌లో ప‌డేస్తున్నాయ‌ని అంటున్నారు. ‘ఆపరేషన్‌ కమల’ను బీజేపీ మళ్లీ ప్రారంభిస్తుందేమోనన్న ఆందోళన నేపథ్యంలో కర్ణాటకలో రిసార్ట్‌ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. విశ్వాస పరీక్షకు ఒకరోజే సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలను గురువారం కూడా హోటళ్లకే పరిమితం చేశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్‌ తీర్పు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రిసార్టుల్లోనే గడుపుతున్నారు. ఈ నెల 15 నుంచి కుటుంబాలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడు బయటపడుతామా అని ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఫోన్‌ సౌకర్యం కూడా అందుబాటులో లేదని, మీడియాతో మాట్లాడనివ్వడం లేదని విమర్శలు వస్తున్నా అలాంటిదేమీ లేదని కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు ఖండిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఒక్క పూట ఇంటికి వెళ్లే అవకాశం కల్పించాలని కోరినా వారికి అనుమతి లభించలేదని తెలుస్తున్నది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి శుక్రవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఎటువంటి రిస్కు తీసుకోవద్దని కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ తన ఎమ్మెల్యేలను బెంగళూరులోని హిల్టన్‌ ఎంబసీ గోల్ఫ్‌లింక్స్‌ హోటల్‌లో ఉంచగా.. జేడీఎస్‌ తన ఎమ్మెల్యేలను గోల్ఫ్‌ష్రైన్‌ రిసార్ట్‌లో ఉంచింది. విశ్వాస పరీక్ష అయ్యేవరకు తమ ఎమ్మెల్యేలు రిసార్ట్‌లోనే ఉంటారని, తర్వాత వారు తమ తమ కుటుంబాలను కలుసుకోవచ్చని ఓ కాంగ్రెస్‌ నాయకుడు తెలిపారు. ఎమ్మెల్యేలను నిర్బంధించారన్న ఆరోపణలపై స్పందిస్తూ ‘దీనిని నిర్బంధించడం అని అంటే అందరూ అలాగే ఉండాలని కోరుకుంటారు. ఎమ్మెల్యేలు అత్యంత విలాసవంతమైన రిసార్టుల్లో ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. ఫోన్లు స్వాధీనం చేసుకున్నామనడం సరికాదు. వారి ఫోన్లు వారి వద్దే ఉన్నాయి. వారు తమ తమ కుటుంబాలతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోవాలని కొంతమంది కావాలనే కుట్రలు చేస్తున్నారు’ అని సదరు కాంగ్రెస్‌ నేత చెప్పారు. కాగా ఈ విమర్శలపై జేడీఎస్‌ నేత సదానంద స్పందిస్తూ ‘ఒక్కసారి విశ్వాస పరీక్ష ముగిసిన తర్వాత మా ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు తిరిగి వెళ్తారు. ఫోన్లను తీసుకున్నామనేది అబద్ధం’ అని వెల్ల‌డించారు.