సుప్రీంకోర్టులో అర్థరాత్రి హైడ్రామా!

Thu May 17 2018 09:00:20 GMT+0530 (IST)

ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రాత్రి పది తర్వాత కర్ణాటక గవర్నర్ యడ్డీని ప్రభుత్వం ఏర్పాటు చేసి.. బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా కోరుతూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై కాంగ్రెస్.. జేడీఎస్ పార్టీలు భగ్గుమన్నాయి. న్యాయం కోసం అర్థరాత్రి దాటిన తర్వాత సుప్రీం తలుపులు తట్టారు. ఈ రోజు (గురువారం) ఉదయం 9.30 గంటలకు యడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్.. జేడీఎస్ లు న్యాయపోరాటానికి దిగాయి.ఊహించని విధంగా అర్థరాత్రి వేళ ఈ కేసును వినాల్సిందిగా కోరాయి. ఎన్నికల అనంతరం ఏర్పడిన కూటమిగా తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు స్పష్టమైన మెజార్టీ ఉన్న నేపథ్యంలో తమను కాదని.. పెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ వజూభాయ్ వాలా ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తూ సుప్రీంను ఆశ్రయించారు.

గవర్నర్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ.. బుధవారం రాత్రి 11.47 గంటలకు అత్యవసరంగా ఒక హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అప్పటికప్పుడు వాదనలు వినాలని అభ్యర్థించింది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనుసింఘ్వి.. వివేక్ తనఖా.. పార్టీ లీగల్ సెల్‌కు చెందిన లాయర్లు కృష్ణ మీనన్ మార్గ్‌లో ఉన్న చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఇంటికి రాత్రి 12.28 గంటల వేళలో చేరుకున్నారు. కర్ణాటకలో అనైతికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని.. గురువారం ఉదయం 9.30 గంటలకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని.. గవర్నర్ ఆదేశాల్ని నిలుపుదల చేస్తూ సుప్రీం నిర్ణయం ప్రకటించాలని కోరారు.

తొలుత ఈ అంశంపై విచారణ జరిపేందుకు చీఫ్ జస్టిస్ సుముఖత వ్యక్తం చేయలేదు. అనంతరం ఆయన వాదనలు వినేందుకు సిద్ధమయ్యారు. అర్థరాత్రి 1.45 గంటలకు ఆరో నెంబరు కోర్టులో విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ధర్మాసనంలో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ కు ఈ వ్యవహారాన్ని కేటాయించారు. కాంగ్రెస్.. జేడీఎస్ సంయుక్తంగా వేసిన పిటిషన్ ను పరిశీలించిన చీఫ్ జస్టిస్ దీనికి సంబంధించిన వాదనల్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు.

దీంతో సింఘ్వి బృందం అప్పటికప్పుడు సుప్రీంలోనే ఉండిపోయి తమ వాదనల్ని వివరంగా అందజేసింది. గవర్నర్ విచక్షణ పేరుతో రాజ్యాంగ నియమాలను.. సంప్రదాయాల్ని పక్కన పెట్టేశారని.. రామేశ్వర్ ప్రసాద్ కేసులో జస్టిస్ సభర్వాల్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును గాలికి వదిలేశారని తప్పు పట్టింది.

గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ఇచ్చిన తీర్పునకు విలువ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్.. జేడీఎస్ తరపున సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ ను సీనియర్ న్యాయవాది దేవ్ దత్ కామత్ రూపొందించారు. తన పిటిషన్లో కాంగ్రెస్.. జేడీఎస్ ల బలం 116 మంది ఎమ్మెల్యేలు ఉండగా..బీజేపీకి 104 మంది మాత్రమే ఉన్నారని.. మెజార్టీ కూడా లేదని పేర్కొన్నారు. మరి.. మెజార్టీ ఉన్న కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు ఆహ్వానించలేదు? అని ప్రశ్నించారు.

తమ కేసును వినటానికి అంగీకరించినందుకు న్యాయవాది సింఘ్వీ సుప్రీంకు థ్యాంక్స్ చెప్పారు. న్యాయం నిద్రపోదు.. 24 గంటలూ అందుబాటులో ఉటుందనటానికి తాజా కేసే ఉదాహరణ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్.. జేడీఎస్ లు అర్థరాత్రి వేసిన పిటిషన్ పై బీజేపీ తరఫున వాదనలు వినిపించేందుకు అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.